13-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వెల్లడి
మానకొండూర్, అక్టోబర్12 (విజయ క్రాంతి): రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ధాన్యం అమ్మకాల విషయం లో ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటు న్నదని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఆదివారం బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, గుగ్గిళ్ల, గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలను విరివిగా ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. గతంలో కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. గత సీజన్లో కంటే ప్రస్తుత యేడాది మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని ఆయన చెప్పారు.ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389కి తోడుగా క్వింటాలుకు రూ.500 బోనస్, సాధారణ బీ గ్రేడ్ రకానికి రూ. 2,369 మద్దతు ధర నిర్ణయించిందన్నారు.
గత యేడాది కంటే ఈసారి అద నంగా మద్దతు ధర పెరిగిందని చెప్పారు. రైతులు ధాన్యం బాగా ఆరబోసి కేంద్రాలకు తీసుకొస్తే తూకం వేయడంలో ఇబ్బందులు ఉండవన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకు వచ్చి కనీస మద్దతు ధరను పొందాలన్నారు.17 శాతం కంటే తక్కువ తేమ ఉండే విధంగా రైతులు చూసుకోవాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆయన సూచించారు.
తూకం విషయంలో తేడాలు ఉండకూడదన్నారు. సన్న రకం వరి ధాన్యం పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500 బోనస్ అందిస్తున్న ట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా అందిస్తున్నదన్నారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ సుధీర్, ఏపీవో పర్షరాములు, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు గూడెల్లి శ్రీకాంత్, బైర సంతోష్,లింగం, చెప్యాల శ్రీనివాస్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం గన్నేరువరం మండలంలో పలు శుభకార్యాలకు ఎమ్మెల్యే డాక్టర్ కు పంపిణీ సత్యనారాయణ హాజరయ్యారు. గునుకుల కొండాపూర్ గ్రామ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగపురి శంకర్ మనవడి జన్మదిన వేడుకకు ఎమ్మెల్యే హాజరై ఆశీర్వదిం చారు. అలాగే గుండ్లపల్లి స్టేజ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ గ్రిల్ చికెన్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు.