ప్రైవేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా
వేసవి సెలవుల్లో తరగతులు, అడ్మిషన్లు చేపట్టడంపై కన్నెర్ర
27 కాలేజీలకు రూ.లక్ష చొప్పున ఫైన్
హైదరాబాద్, మే 03 (విజయక్రాంతి): నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝళిపించింది. వేసవి సెలవుల్లో కొత్త విద్యాసంవత్సరానికి తరగతులు నిర్వహించడం, షెడ్యూల్ విడుదల కాకముందే అడ్మిషన్లు చేపట్టడంపై సీరియస్ అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించిన 27 కాలేజీలకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించిందినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ కాలేజీల జాబితాలో రెజోనెన్స్ విద్యాసంస్థలకు చెందిన కాలేజీలు 7, వశిష్ఠ 4, తపస్య 4, నారాయణ 1, అర్బన్ కాలేజీలు 2తోపాటు మరికొన్ని ఉన్నాయని చెప్పారు.
మార్చి 31 నుంచి ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులను బోర్డు ప్రకటించింది. ఈ సెలవుల్లో ఎలాంటి క్లాసులు నిర్వహించరాదని, అడ్మిషన్లు తీసుకోవద్దని ఆదేశించింది. ఆదేశాల ఉల్లంఘనపై విద్యార్థి సంఘాల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నారు.
అయితే, జరిమానాలు విధించినా ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలను వదిలేసి కేవలం చిన్నాచితకా కాలేజీలపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బడా కాలేజీలు బహిరంగంగా నీట్, జేఈఈ, ఇంటర్ క్లాసులు నిర్వహిస్తున్నా వాటిని పట్టించుకోవడంలేదన్న చెబుతున్నారు.




