ప్రభాకర్‌రావు కోసం పోలీసుల వేట
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీకి..
నాంపల్లి కోర్టులో దర్యాప్తు బృందం పిటిషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి అనుమతివ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా.. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించారని గుర్తించారు.
ఆయన ఆదేశాల మేరకు మిగతా అధికారులు పని చేశారని దర్యాప్తు బృందం నిర్ధారణకు వచ్చింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోగా ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ఇంటర్‌పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 73 ద్వారా ప్రభాకర్‌రావుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.




