8 July, 2026 | 1:53 AM

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

08-07-2026 12:00 AM

రూ.7లక్షల సొత్తు స్వాధీనం

సిద్దిపేట క్రైం, జూలై 7: వరుస చోరీలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వి వరాలను ఏసీపీ రవీందర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దుద్దెడ గ్రామనికి చెందిన బునాద్రి కనుకవ్వ అనే వృద్ధురాలు టోల్గెట్ దగ్గర దోసకాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతోంది.

రోజూమాదిరిగానే గత నెల 30న దుకాణంలో ఉండగా, సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కనకవ్వ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును తెంపుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఆదేశానుసారం పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్ప డి నిందితుడి కోసం గాలించారు. దుద్దెడ, చేర్యాల, కొమురవెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లోని ఎల్లంపేట గ్రామానికి చెందిన కుంచం రాజు అనే పాత నేరస్థుడు నేరం అంగీకరించాడని ఏసీపీ రవీందర్ తెలిపారు. అతడు గతంలో తొర్రూరు, డోర్నకల్, రాజాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డోజర్ ట్రాక్టర్లు, హిటాచి నుంచి టూల్ కిట్ దొంగతనాలు చేసి చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.

జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 20న సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామనికి చెందిన పొన్నాల యాదవ్వ అను మహిళను నమ్మించి, బైక్ పై వెంకయకుంట వద్దకు తీసుకెళ్లి  బెదిరించి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తెల తాడును గుంజుకొని పారిపోయాడు.

గత నెల 29న జనగామ దగ్గరలో గల వడ్లకొండ చౌరస్తా దుర్గమ్మ గుడి ముందర మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అదే మోటార్ సైకిల్ పై వచ్చి దుద్దెడ టోల్ గేట్ సమీపంలో కనుకవ్వ మెడలోని  3ట తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. నిందితుడు దొంగిలించిన బంగారాన్ని మాచారెడ్డి చౌరస్తాలోని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, కామారెడ్డిలోని ముత్తూట్ గోల్ లోన్ కంపెనీల్లో కుదువ పెట్టి రూ.6.52 లక్షలు తీసుకొని తన అవసరాలకు వాడుకున్నాడని పోలీసులు తెలిపారు.