13-12-2024 12:16:40 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు డ్రాప్ ఔట్ అయిన వారిని గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశం మందిరంలో ప్రభుత్వం కళాశాలల ప్రిన్సిపాల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మధ్యలో కళాశాల మానివేసిన డ్రాప్ ఔట్ విద్యార్థులను మళ్లీ తరగతి గదిలో కూర్చోబెట్టాలని తెలిపారు. కళాశాలల విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కళాశాలకు దగ్గరలో ఉన్న మత్తు, డ్రగ్స్ దుకాణాలు ఉన్నట్లయితే పోలీస్ అధికారులకు తెలియజేసి మూసి వేయించాలని సూచించారు.
మానసికంగా బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి టేలీమానస్ నెంబర్ 14416కు తెలియజేసి కౌన్సిలింగ్ ఇప్పించాలని తెలిపారు. ఆత్మహత్యల నిరోధానికి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉదయం పూట మెడిటేషన్, యోగా వంటి కార్యక్రమాలను కళాశాలల్లో నిర్వహించాలని తెలిపారు.వార్షిక పరీక్షల రుసుములను విద్యార్థులు చెల్లించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.