02-05-2025 06:00:37 PM
అమరావతి,(విజయక్రాంతి): ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పట్టించామని, అమరావతి కేవలం నగరమే కాదు.. ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పత్రిరూపం.. అమరావతి అని, రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. అమరలింగేశ్వరస్వామి, కృష్ణా నది, బౌద్ధారామాలకు నిలయమైన అమరావతి రైతులు గత ఐదేళ్ల వైసీపి పాలనలో ఎన్నో బాధలు అనుభవించారని ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతి లాంటి ఉద్యమాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని, 2024లో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందన్నారు.
నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా అమరావతి అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ మళ్లీ రావాలని ఈ సందర్భంగా కోరారు. ప్రపంచం మొచ్చే నగరంగా అమరావతిని తీర్చిదిద్ధుతామని, ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతిని అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో 5 లక్షల మంది విద్యార్థులు చదువునేలా ఏర్పాట్లు చేసి భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. విద్య, వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, హరిత ఇంధనంతో కాలుష్యరహిత నగరంగా అమరావతిని మారుస్తామని చంద్రబాబు వివరించారు.
ఇప్పటికే బిట్స్ పిలానీ, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి మరిన్ని విద్యాసంస్థలు అమరావతికి వస్తున్నాయని, 2027 నాటికి పోలవరం పూర్తివుతుందని సీఎం వెల్లడించారు. కేవలం అమరావతినే కాదు.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్ రాబోతున్నాయని, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని, కడపలో స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో పోర్టు వస్తాయని చెప్పారు. ఓర్వకల్లు నోడ్, డ్రోన్ హబ్ గా మారుతోందని, జూన్ 21న విశాఖలో యోగా డేకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు.