02-05-2025 06:37:50 PM
అమరావతి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడి వేదికగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని(Amaravati Reconstruction Program) ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్వహిస్తుంది. ఈ వేడకకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) సభావేదిక పైనుంచే రూ.49,040 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు, రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు తాను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నానని, ఒక స్వప్నం సాకారం కాబోతుందని ఆయన పేర్కొన్నారు.
దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశానని, ఇది కేవలం శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ కు నిదర్శనాలు అని మోదీ చెప్పారు. ఒక స్వాప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుందని, ఇది కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ కు బలమైన పునాదులని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. ఇంద్రలోకం రాజధాని పేరు అమరావతి అని, ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే అని ప్రధాని వెల్లడించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతామని, ఏపీని ఆధునిక ప్రదేశ్, ఆధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.. అమరావతి అన్నారు. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుందని, ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుందని మోదీ వ్యాఖ్యానించారు.
హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకారిస్తుందని హామీ ఇచ్చారు. టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారని, తాను గుజరాత్ సీఎం అయినప్పుడు హైదరాబాద్ లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నట్లు ఆయన వివరించారు. అధికారులను పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించానని, పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తి చేయాలన్న చంద్రబాబుకే సాధ్యమని ప్రధాని అభిప్రాయపడ్డారు. పెద్దపెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరని, 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశామని మోదీ గుర్తు చేశారు. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందని, రాజధాని అభివృద్ధికి కేంద్రం అన్నిరకాలుగా సహకరించిందన్నారు. అమరావతిలో అన్నిరకాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం తోడుంటుందని ఆయన వెల్లడించారు.