23-02-2026 06:08:32 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని మారుమూల గ్రామాలకు నాణ్యమైన సెల్ సిగ్నల్స్‌తో పాటు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, కాగజ్‌నగర్ డివిజన్ అటవీ అధికారి అప్పయ్యలతో కలిసి తహసిల్దార్లు, అటవీ శాఖ అధికారులు, టెలికాం సంస్థల ప్రతినిధులతో సెల్ టవర్ల ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణాలు మరియు ఇంటర్నెట్ సదుపాయాల కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అలాగే ఎయిర్‌టెల్, జియో సంస్థలు టవర్ల నిర్మాణాలు, ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనకు అవసరమైన స్థలాల గుర్తింపు, పాలన పరమైన అనుమతులను త్వరితగతిన పొందాలని ఆదేశించారు.
టవర్ల నిర్మాణాలు పూర్తయితే మారుమూల గ్రామాలకు సెల్ సిగ్నల్స్‌తో పాటు ఇంటర్నెట్ సౌకర్యం విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పథకాల అమలుకు ఇంటర్నెట్ కీలకమని పేర్కొన్నారు. అలాగే టి-ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్లు, అటవీ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో, టి-ఫైబర్ సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.