టెల్ అవీవ్‌పై ఇరాన్ బాంబుల వర్షం
- ఆరుగురికి గాయాలు, పలు భవనాలు ధ్వంసం
- లెబనాన్ సరిహద్దులో ఐడీఎఫ్ దళాలపై విరుచుకుపడ్డ హిజ్బులా
టెల్ అవీవ్, మార్చి 24: ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం టెల్ అవీవ్ సహా నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. క్షిపణి దాడుల్లో పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం కాగా, పలు భవనాలు భారీగా దెబ్బతిన్నాయని, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఇజ్రాయెల్ అధికారి మాగెన్ డేవిడ్ అడోమ్ తెలిపారు.
ఈ దాడుల్లో ఆరుగురికి గాయాలయ్యాయన్నారు. కాగా టెల్ అవీవ్ పలు భవనాల్లో చిక్కుకున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని ఇజ్రాయెల్ అగ్నిమాపక శాఖ ప్రకటించింది. టెల్ అవీవ్ లో సుమారు వంద కేజీల పేలుడు పదార్థాలతో నష్టం వాటిల్లిందని అధికారులు ప్రకటించారు. లెబనాన్ సరిహద్దుల్లోని ఐడీఎఫ్ స్థావరాలపై హిజ్బుల్లా దాడులను తీవ్రతరం చేసింది.
కాగా ఈ రోజు వరకు జరిగిన యుద్ధంలో 4,829 మందికి గాయాలయ్యాయని, 111 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ వైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణల తగ్గుదలకు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఐదు రోజులపాటు యుద్ధ విరమణ అని ట్రంప్ ప్రకటించారు.
మంగళవారం ఉదయం ఇరాన్ లోని పవర్ స్టేషన్ బయట అమెరికా క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఇరాన్ చెబుతోంది. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలు సాధ్యమని కుండబద్ధలు కొడుతోంది. ఇంకోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పై భారీ క్షిపణులతో విరుచుకుపడుతుంది.




