12 August, 2026 | 2:53 AM

ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు!

12-08-2026 12:00 AM
  1. మరణించిన వారికి రెండోసారి డెత్ సర్టిఫికెట్
  2. నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగు చూసిన ఉదంతం

అచ్చంపేట, ఆగస్టు 11(విజయక్రాంతి): నాగ ర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లి గ్రామ పంచాయతీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర అవకతవక లు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే వ్యక్తికి వేర్వేరు తేదీల్లో రెండు డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.కొందరు 2023లో మరణించినట్లు నమోదై.. మళ్లీ 2025లో చనిపోయినట్లు సర్టిఫికెట్లు జారీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొట్ర మడేలు, జల్లెల గోపయ్య, రాగుల బక్కమ్మ, కొంగర చెన్నయ్య తదితరుల పేర్లపై వేర్వేరు మరణ తేదీలతో ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.

మేడమోని బాలయ్య పేరుతో ఒకే మరణ తేదీ పలుమార్లు నమోదైనట్లు, కాట్రాజు పెంటయ్య విషయంలోనూ ఒకే ఏడాదికి రెండు వేర్వేరు మరణ తేదీలు నమోదైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏడాది దాటిన పాత జననాలను సంబంధిత ఉన్నతాధికారుల అనుమతులు, ఆర్డీవో ప్రొసీడింగ్ లేకుండానే నమోదు చేసి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆస్తులు, వారసత్వం, పింఛన్లు, బీమా తదితర వ్యవహారాల్లో కీలకమైనందున ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీలో గత కొన్నేళ్లుగా జారీ చేసిన అన్ని సర్టిఫికెట్లను రిజిస్టర్లు, దరఖాస్తులు, ఆధార పత్రాలతో సరిపోల్చి పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.