24 August, 2026 | 3:15 AM

వాలంటరీ ఉపాధ్యాయుల ఎంపికలో అవకతవకలు?

24-08-2026 02:43 AM

అదనపు క్వాలిఫికేషన్ పేరుతో పక్క గ్రామస్తురాలికి ఇచ్చే కుతంత్రం...

మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన మహిళ

కోటపల్లి, ఆగస్టు 23 : మంచిర్యాల జిల్లాలో 72 ఫ్రీ ప్రైమరీ పాఠశాలలకుగాను 72 మంది ఇన్ స్ట్రక్టర్లు, ఆయాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విధితమే. కాగా కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్(పీపీఐ), ఆయా ఉద్యోగానికి దరఖాస్తుల స్వీకరణ కోరగా, 11 మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో స్థానిక (సర్వాయిపేట) గ్రామపంచాయతీ పరిధిలో 10 దరఖాస్తు ఫారాలు స్వీకరించడంతో పాటు పక్క గ్రామ పంచాయతీ(ఎసన్వాయి)కి చెందిన ఒక అభ్యర్థి దరఖాస్తు స్వీకరించారు. అభ్యర్థుల దరఖాస్తుల జాబితా ప్రక్రియ పరిశీలన కోసం జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి పంపించారు. 

అదనపు క్వాలిఫికేషన్ పేరుతో పక్క గ్రామస్తురాలికి ఇచ్చే కుతంత్రం...

విద్యా శాఖ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ ల కోసం దరఖాస్తులు తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా రూల్స్ ప్రకారం ఏ ప్రాంత పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉంటుందో దరఖాస్తుదారులు అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి, అలాగే పాఠశాలకు సమీపంలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ కోటపల్లి మండలం సర్వాయిపేటలో మాత్రం ఇందుకు విరుద్దంగా అధికారులు వ్యవహరించారు. నాన్ లోకల్ (ఎసన్వాయి)కి చెందిన అభ్యర్థి (శ్రావణ్య)కి అదనపు క్వాలిఫికేషన్ పేరుతో సంబంధిత అధికారులు కాల్ లెటర్ ఇచ్చారు. 

మండల ప్రజావాణిలో ఫిర్యాదుతో వెలుగులు...

కోటపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గత సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో సర్వాయిపేటకు చెందిన జీ పూజిత తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉంటున్న తనకు కాదని పక్క జీపీ నుంచి వచ్చిన అభ్యర్థికి నియామక పత్రం ఇచ్చారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరడంతో అధికారులు ఖంగుతిన్నారు. అధికారులు ఆమ్యామ్యాలకు ఆశపడి నాన్ లోకల్ అభ్యర్థిని ఎంపిక చేశారని అర్హులు ఆరోపిస్తున్నారు. జిల్లాకు రెగ్యూలర్ డీఈఓ లేకపోవడం, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)కి ఇంఛార్జీ ఇవ్వడంతో క్రింది స్థాయి అధికారులు ఆడిందే ఆట అవుతుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి మొగిలిని సంప్రదించగా ప్రీ ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ త్వరగా జరుపాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీఈడీ క్వాలిఫికేషన్ ఉందని అభ్యర్థి ఎంపిక పూర్తి చేశామని, నాన్ లోకల్ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి శ్రవణ్య నియామక ఉత్తర్వును రద్దు చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. ఎంఐఎస్ కో ఆర్డినేటర్ సైతం తప్పుగా నమోదు చేసిన జాబితా ఇవ్వడం వల్ల ఈ తప్పిదం జరిగిందన్నారు.