పంటలు ఎండిపోతున్నాయి.. తక్షణమే సాగునీరు విడుదల చేయండి...
* అసెంబ్లీలో గళమెత్తిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఆమనగల్లు,(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే కెఎల్ఐ(కల్వకుర్తి ఎత్తిపోతల పథకం) కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన నియోజకవర్గ రైతుల సమస్యలపై గళమెత్తారు. చేతికొచ్చే తరుణంలో నీటి నిలిపివేతగత 15 రోజులుగా కెఎల్ఐ కాలువల ద్వారా నీటి సరఫరాను నిలిపివేయడం వల్ల పొలాలు నెర్రెలు బారుతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారని, ప్రస్తుతం పంట గింజ కట్టే కీలక దశలో ఉందని ఆయన వివరించారు. ఈ సమయంలో నీరు అందకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పులు తెచ్చి సాగు చేసిన రైతులకు ఈ పరిస్థితి పిడుగులాంటి వార్తని, ప్రభుత్వం స్పందించకుంటే అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 15 రోజులుగా నీరు లేక పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లుతున్నారు.
తక్షణమే కాలువలకు నీటిని పునరుద్ధరించి పంటలను కాపాడాలి. ఎమ్మెల్యే కోరారు.కెఎల్ఐ ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువల చివరి భూములకు అందేలా నీటిని విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.పంట నష్టపోయే స్థితిలో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని, పంటలు చేతికి వచ్చే తరుణంలో నీటి విడుదల ఆపివేయడం అన్యాయమని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సాగునీరు అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.




