21-04-2025 01:35:06 AM
కామారెడ్డి, ఏప్రిల్ 20,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి అసెస్మెంట్ నెంబర్ వేసి డబ్బులు దండుకొని తద్వారా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీని అంతటికీ కారణం దోమకొండ మండల కేంద్రంలోని దస్తావేజులేఖరే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ సంబంధిత దస్తావేజులేఖరి తన పలుకుబడిని ఉపయోగించి అధికారులను తప్పుదోవ పట్టించి ఎవరు ఏమి చేయలేరు అన్న ధీమాతో ఇప్పటికీ పంచాయతీ వ్బుసైట్ను అనధికారికంగా వాడుకుంటున్నట్లు సమాచారం.
అయినప్పటికీ అధికారులు మాత్రం పూర్తిస్థాయి విచారణ చేయడంలో విఫలమవుతున్నారు. గతంలో కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామంలో ముగ్గురు కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమిని వారికి తెలియకుండా వారి కుటుంబ సభ్యులకు చెందిన ఒకరి పేరు పైనే అసెస్మెంట్ నెంబర్ వేసి ఆక్రమంగా పంచాయతీ వ్బుసైట్లోకి ప్రవేశించి అందులో ఆ నెంబర్ను వేయడంతో సంబంధిత రిజిస్టర్ అతని పేరు పైన భూమిని రిజిస్ట్రేషన్ చేశారు.
సదరు కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో అధికారులు కలగజేసుకొని వారి మధ్య రాజి కుదురించే ప్రయత్నించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో సంబంధిత బాధ్యులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు అని సమాచారం. ఇటీవల బిక్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శికి సమాచారం లేకుండా రెండు అసెస్మెంట్ నెంబర్లు పంచాయతీ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటి నెంబర్, 3- 89/2/A, అసెస్మెంట్ నెంబర్,883, సృష్టించి అక్రమంగా ఈ పంచాయతీ వ్బుసైట్లోకి ప్రవేశించి డాక్యుమెంట్ నెంబర్ 312/2024, లో497.77 గజాల స్థలాన్ని తేదీ 22 జనవరి 2024న రిజిస్ట్రేషన్ చేశారు.
దీంతోపాటు అదే సమయంలో అసెస్మెంట్ నెంబర్ దానిని పెట్టి డాక్యుమెంట్ నెంబర్ 311/2024, 470.30 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఒక అసెస్మెంట్ నెంబర్ పై ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉండగా సంబంధిత రిజిస్టర్ మాత్రం ఒక అసెస్మెంట్ నెంబర్తో, ఓకే ఇంటి నెంబర్ పై రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంపై సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి వివరణ కోరగా తాము అట్టి అసెస్మెంట్ నెంబర్లను జారీ చేయలేదన్నారు.
ఈ విషయంపై సంబంధిత రిజిస్టర్ ను వివరణ కోరగా ఈ పంచాయతీ వ్బుసైట్లో ఆ నెంబరు ఉండడంతోనే తాను రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. వీటి అన్నిటిని ఆధారంగా చేసుకుని జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు.
కోట్లకు పడగలెత్తిన ఆ దస్తావేజులేకరి..?
ఆ దస్తావేజులేఖరీ సామాన్య స్థాయి నుండి కోట్లకు ఎలా పడగలెత్తడానే కోణంలో పలువురు ఆ దస్తావేజు లేఖరిపై దృష్టి పెట్టగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . కామారెడ్డి జిల్లాలోని రాజంపేట, భిక్కనూర్, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి మండలాల లతోపాటు ఇటీవల వెలుగు చూసినా దోమకొండ గ్రామంలో జరిగిన తప్పుడు అసెస్మెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రధాన సూత్రధారి ఆ దస్తావేజులేఖరి చేసిన పని అయి ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సరియైన విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాలపై పత్రికల్లో ఇప్పటికే ప్రచురితం కాగా ఏసీబీ అధికారులు దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించి అధికారుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.