22 August, 2026 | 2:07 AM

అక్షర ప్రేమికుడు ఫణీంద్ర!

22-08-2026 12:00 AM

‘కందం రాసినవాడే కవి’ అనే నానుడి ఉంది. సుమతీ శతకం కంద పద్యాల్లో రచింపబడి అమితానందాన్ని అందిస్తుంది. నీతిని బోధిస్తుంది. భారత ప్రభుత్వ అణుఇంధన సంస్థలో 38 సంవత్సరాలపాటు శాస్త్రవేత్తగా పనిచేసిన ఆచార్య ఫణీంద్ర తన పన్నెండేళ్ల వయస్సులోనే కందపద్యం రాశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఫణీంద్ర అసలు పేరు గోవర్థనం వేంకట ఫణీంద్ర శయనాచార్య. మన తెలంగాణలోని నిజామాబాద్ పట్టణంలో జన్మించిన ఫణీంద్ర మాతామహులు, పితామహులు సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పండితకవులు.

వీరి కవిత్వం ‘గోల్కొండ కవుల సంచిక’లో ఉండటం విశేషం. ఫణీంద్ర బాల్యంలో నిజామాబాద్‌లో చదివి ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభుద్రడయ్యారు. అణుఇంధన సంస్థలో ఉద్యోగం చేస్తూ అక్షరం వైపు ప్రయాణించారు. సాహిత్యం పట్ల తనకున్న అభిరుచి మేరకు తెలుగులో ఎం.ఏ డిగ్రీతోపాటు ‘19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత’ అనే అంశం మీద పిహెచ్.డి పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీని సాధించారు.

ఫణీంద్ర శాస్త్రవేత్తగా కొంతమందికి తెలిసి ఉండవచ్చు గానీ, కవిగా, రచయితగా, సంస్థల నిర్వాహకుడిగా తెలుగు సాహితీలోకానికి బాగా తెలుసు. ముకుంద శతకం, పద్య ప్రసంగాలు, ముద్దుగుమ్మ, వరాహ శతకం, మౌక్తికం వంటి పద్యకృతులతో తెలుగు భారతికి శోభను కూర్చారు. సమాజంలోని దురాచారాలను వరాహానికి తెలియజేస్తూ రచించిన కృతి ‘వరాహశతకం’. మహోంధ్రయం (ధాశరథి) ప్రేరణతోనే నేను ‘తెలంగాణోదయం’ పద్యకవితా సంకలనం రచిస్తే, ఫణీంద్ర ‘తెలంగాణ మహోదయం’ అనే పద్యకృతిని రచించారు.

ఫణీంద్ర దేశవిదేశాలకు ఎక్కడికి వెళ్లినా, అక్కడి విశేషాలను పద్యకృతులుగా వెలువరించడం అలవాటుగా చేసుకున్నారు. ఉద్యోగపరంగా 2001లో భారత ప్రభుత్వం దిగుమతి చేసుకున్న అణు ఇంధనాన్ని తనిఖీ చేయడానికి రష్యాకు పంపిన శాస్త్రవేత్తల్లో ఫణీంద్ర ఒకరు. అప్పుడాయన మాస్కోలో పర్యటించిన అనుభవాలను ‘మాస్కో స్మృతులు’ పేరిట తెలుగులో ‘తొలి సమగ్ర విదేశీ యాత్రా పద్యకావ్యం’ రచించడం ప్రశంసార్హమైంది. ‘కార్గిల్ యుద్ధం’ ఆయన్ని కదిలించిందనటానికి ‘విజయక్రాంతి’ పేరిట ఆయన రాసిన కావ్యం మంచి ఉదాహరణ.

సంస్కృతంలో అమరుకుడనే కవి ఒకే శ్లోకాన్ని రచించి ‘అమరుక కవిరేక శ్లోకః’ అని పేరుగాంచారట. అలాగే ఫణీంద్ర తెలుగులో ఏకకావ్య కవితా ప్రక్రియకు నాంది పలికారు. అది ‘వాక్యం రసాత్ముకం కావ్యం’ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఆంగ్లంలోకి ‘సింగిల్ సెంటెన్స్ డిలైట్స్’ పేరుతో అనువదింపబడింది. ఫణీంద్ర కవితలు హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లోకి అనువదింపబడ్డాయి. హాస్యప్రియుడైన ఫణీంద్ర ‘సాహితీ సల్లాపాలు’ పేరిట కవిపండితుల ఛలోక్తులను ఒక సంపుటిగా తెచ్చారు. ‘భారత భారతి’ పేరుతో కవిత్రయం భారతంలోని ప్రసిద్ధ పద్యాలకు చక్కని వ్యాఖ్యాన గ్రంథం రచించారు.

ఫణీంద్రకు పద్యసాహిత్యం అంటే, పద్యరచన అంటే చాలా ఇష్టం. రామాయణ గాథను ఉత్సాహ వృత్తపద్యాలలో ‘శ్రీరామాయణ తారావళి’ పేరుతో రచించి గానం చేయించి, దాన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్‌లో ఆవిష్కరించారు. ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ ప్రచురించిన ‘పరంపర’ అనే కవుల పరిచయ గ్రంథంలోను, భాషా సాంస్కృతిక శాఖ వారి ‘తెలంగాణ కవులు కావ్యాలు’ గ్రంథంలోను స్థానం సంపాదించుకున్నారు.

2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఫణీంద్ర రాసిన ‘తెలంగాణలో తెలుగు భాష’ అనే వ్యాసానికి విశిష్ట బహుమతి లభించింది. ఈ వ్యాసం అమెరికా తెలుగు సంఘం (ఆటా) రజతోత్సవ సంచికలో ప్రచురితమైంది. 2023లో ‘తానా’ వారు నిర్వహించిన పోటీలో ఆయన రచించిన ‘సైసైరా చిన్నపరెడ్డి’ అనే కావ్యం ‘ఉత్తమ పద్యకావ్యం’గా ఎన్నికైంది.

ఫణీంద్ర నండూరి రామకృష్టమాచార్యుల శిష్యునిగా ఉన్నారు. ‘సాహితీ కౌముది’ అనే పత్రికకు పదేళ్ల పాటు సంపాదకులుగా పనిచేశారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అవధాన కార్యక్రమాల్లో నిషిద్ధాక్షరి, సమస్య వంటి అంశాలనిచ్చి సత్కారం పొందారు. దేశంలోని పలు వేదికలపై భువన విజయం, ఇంద్రసభ, ప్రతాపరుద్ర విజయం, తెలుగు సాహితీవైభవం, గోలకొండ సాహితీ వైభవం, అగ్నిధార వంటి సాహితీ రూపకాలలో ప్రాచీన, ఆధునిక కవుల పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్ననలందుకున్నారు.

ఫణీంద్రకు వివిధ సాహితీ సంస్థలతో గల అనుబంధం చెప్పుకోదగినది. సుప్రసిద్ధ సాహితీ సంస్థ యువ భారతికి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. నవ్య సాహితీ సమితి, నండూరి రామకృష్టమాచార్య సాహిత్యపీఠం మొదలైన సాహిత్య సంస్థలకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆచార్య ఫణీంద్ర సాహితీ కృషికి లభించిన సత్కారాలు, బిరుదులు అనేకం. ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం’ నుంచి ‘మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’ అందుకున్నారు.

‘తెలంగాణ సారస్వత పరిషత్తు’, ‘దివాకర్ల ట్రస్టు’, ‘మహాకవి సినారె కళాపీఠం’, నవ్యసాహిత్య మండలి’, ‘తేజ ఆర్ట్స్ క్రియేషన్’ మొదలైన సాహితీ సంస్థల నుంచి పురస్కారాలు పొందిన ఫణీంద్ర సిలికానాంధ్ర నుంచి ‘సిలికానాంధ్ర గేయకవితా పురస్కారం’ అందుకున్నారు. ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్టు’ ‘వైజ్ఞానిక రత్న’ బిరుదుతో సత్కరించింది. ఏలూరులోని నవ్య సాహిత్య మండలి ‘కవి దిగ్గజ’ బిరుదునిచ్చి గౌరవించింది. హైదరాబాద్‌లోని ‘నవ్యసాహితీ సమితి’ ‘ఏకవాక్య కవితా పితామహుడు’ బిరుదునిచ్చి సత్కరించింది. మెదక్ జిల్లా రచయితల సంఘం ‘సాహితీ విరించి’ బిరుదునిచ్చి సన్మానించింది. విశేషించి తెలుగు విశ్వవిద్యాలయం 2013లో ‘కీర్తి పురస్కారం’ ఇచ్చింది. 

ఆచార్య ఫణీంద్ర అక్షర ప్రేమికుడు. అణు ఇంధన సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ, తెలుగు సాహిత్యానికి ఎంతో సేవచేసిన ఫణీంద్ర నిత్యం ఏదో ఒక సాహితీ సభలో పాల్గొంటారు. ఒక శాస్త్రవేత్త తెలుగు భాషను, సాహిత్యాన్ని ఇంతగా ప్రేమించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఫణీంద్ర తాను రచించిన వరాహ శతకానికి నాతో పీఠిక రాయించారు. నేను ఆస్ట్రేలియాను సందర్శించి రచించిన ‘శకోపనిషత్తు’ అనే పద్యకావ్యానికి ఆయన రాసిన పీఠిక నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఉద్యోగంలో ఉండగానే 2014లో అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ‘నాటా’ తెలుగు సభల్లో పాల్గొని గౌరవం పొందారు. హైదరాబాద్‌లో హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో ‘తెలుగు పద్య సౌరభం’ అనే పేరుతో ప్రసిద్ధ తెలుగు కవిపండితుల విశిష్ట కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు ఫణీంద్రకు సాహితీలోకంలో ఎంతో పేరు వచ్చింది. నిత్యం ఏదో ఒక సాహితీ కార్యక్రమంలో పాల్గొనే ఫణీంద్రను మనం ఇప్పుడు శాస్త్రవేత్తగా కాక, సాహితీవేత్తగా గుర్తిద్దాం. 

 వ్యాసకర్త సెల్: 9885654381