calender_icon.png 13 November, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటికెళ్లి సర్వసభ్య సమావేశమా?

13-11-2025 12:50:40 AM

-మూడోవ కల్లు డిపోలో అక్రమార్కుల ఆగడాలు?  ఊర్లకు వెళ్ళి సంతకాల సేకరణ 

-రూ.60 వేల బకాయిలు ఇస్తామని హామీలు 

-ఇంటికెళ్ళి సంతకాల సేకరణ డిపో రెన్యువల్ ప్రయత్నాలు 

-డైరెక్షన్ ఎక్సైజ్ అధికారులే న్యాయం పక్షానే ‘విజయ క్రాంతి’

నిజామాబాద్, విజయ క్రాంతి (నవంబర్ 12): సర్వసభ్య సమావేశం‘ అంటే సొసైటీ సభ్యులందరూ ఒకచోట సమావేశమై, చర్చించి, తీర్మానాలు చేయడం. కానీ నిజామాబాద్ మూడవ కల్లు డిపోను దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. నిబంధనలు, చట్టాలు వారికి చుట్టాలుగా మారిపోతాయి. అందుకే వారు ఇప్పుడు ‘ఇంటింటికి సర్వసభ్య సమావేశం‘ అనే వింత నాటకానికి తెరలేపారు.

మూతపడిన డిపోను ఎలాగైనా తెరిపించి, తిరిగి తమ అక్రమాలకు మార్గం సుగమం చేసుకునేందుకు గీతా కార్మికులను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఆదివారం నాడు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి కోరం లేకపోయినా (కేవలం 19 మంది సభ్యులు హాజరైనా) వందలాది మంది హాజరైనట్లుగా సృష్టించేందుకు ఈ అడ్డదారిని ఎంచుకున్నారు. కొత్తగా 55 మంది సభ్యులకు, పాత బకాయిలు సుమారు రూ. 60 వేల వరకు ఇస్తామని ఆశ చూపిస్తూ, వారి ఇళ్ల వద్దకే వెళ్లి సర్వసభ్య సమావేశానికి హాజరైనట్లుగా సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.

సంతకాలు పెడితేనే బకాయిలు..

డిపో యాజమాన్యం తమకు అనుకూలమైన కొందరిని వెంటబెట్టుకుని, వివిధ గ్రామాల్లో ఉన్న కార్మికుల వద్దకు వెళ్తున్నారు. వారంలో జరిగే సంతల్లో  సైతం కార్మికులను గుర్తించి, వారిని పక్కకు పిలిచి మరీ సంతకాలు పెట్టాలని బలవంతం చేస్తున్నారు. ముఖ్యంగా భీమ్గల్ మండలంలోని గోనుగోప్పుల, ముచ్కూర్ పురానిపెట్, సిరికొండ మండలంలోని పెద్ద వాల్ గోట్, ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి, నవీపేట్ మండలంలోని, నిజామ్ పూర్, వేల్పూరు మండలంలోని  సాహెబ్ పేట్, సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామాల్లోని సభ్యులను మభ్యపెట్టి సంతకాలు సేకరిస్తున్నారు. 

ఇవే కాకుండా, పనుల నిమిత్తం నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్ వెళ్లిన కార్మికులను సైతం వదల కుండా, వారి వద్దకు వెళ్లి మరీ తీర్మానం కాపీలపై సంతకాలు పెట్టించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13లోగా ఈ సంతకాల ప్రక్రియను పూర్తిచేసి, మూతపడిన కల్లుడిపోను తెరిచేందుకు యాజమాన్యం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులు అంతర్గతంగా మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

సినీమా కథలా..

మల్లయ్య మామూలోడు కాదు. స్వప్నలోక విహారి అన్నట్టు మూడవ కల్లు డిపో లైసెన్స్ రెన్యువల్ వ్యవహారం సాగుతుంది. మల్లయ్య బాటలో డిపో నిర్వాహకులు, కార్మికులను ఊహల లోకంలో జోలలాడిస్తున్నారు. డిపో రెన్యువల్ కాగానే, బకాయి డబ్బులు సుమారు రూ.50వేల నుంచి రూ.60వేల వరకు చెల్లిస్తామని, ఒకరికి తెలియకుండా మరొకరికి ‘స్వప్న‘ ప్రేరేపిత వాగ్దానాలు,  ఇవ్వడం విశేషం. మల్లయ్య మంత్రాలు చదవడం కొసమెరుపు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మల్లయ్య సినీ ఎంట్ర్పజెస్ సమర్పణ కాగా, మ్యూజిక్ స్వప్నలోక మ్యూజికల్ ఆల్బమ్స్ నుంచి వెలువడుతున్నట్టు ఉంది మూడో డిపోలో ముగ్గురు విలన్లు సినిమా కథ అని చెప్పుకోవచ్చు.

నిబంధనలు బేఖాతరు.. అక్రమ అధ్యక్షుడి నియామకం

వాస్తవానికి సొసైటీ అధ్యక్షుడు రాజీనామా చేస్తే, ఉపాధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించాలి. వారిద్దరూ రాజీనామా చేస్తే, సహకార చట్టం ప్రకారం ఎన్నికల అధికారి సమక్షంలో, ఓ ఎక్సైజ్ అధికారి, ఓ కో ఆపరేటివ్ అధికారి హాజరులో సర్వసభ్య సమావేశం నిర్వహించి, తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. కానీ, దశాబ్ద కాలంగా అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో, ఎక్సైజ్ అధికారుల మద్దతుతో రోజుకు లక్షలు దోచుకున్న ఈ ముగ్గురు యజమాన్యానికి ఈ నిబంధనలు వర్తించవన్న ట్లుగా ప్రవర్తిస్తున్నారు. వారికి వారే ఓ సమావేశాన్ని తూతూ మంత్రం గా నిర్వహించి యాజమాన్యానికి నచ్చిన రోజూ డబ్బులుతెచ్చి జేబులు నింపుతున్న ఒక వ్యక్తికి అధ్యక్ష పీఠాన్ని అప్పగించారు. ఈయనే మీ అధ్యక్షుడు అని కార్మికులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

బెదిరింపులు, మభ్యపెట్టడాలు

ఆదివారం జరిగిన సమావేశంలో, కార్మికులకు రావలసిన బకాయిల గురించి ప్రశ్నించిన వారిని యాజమాన్యం మభ్యపెట్టింది. ‘డిపో మొదలవగానే మొదటి వేతనం నీకే ఇస్తాం, ముందు సంతకం పెట్టు‘ అని ఒత్తిడి తెచ్చి, సంతకం పెట్టని కార్మికులను బెదిరించి మరీ, తీర్మానం కాపీలపై సంతకాలు చేయించుకున్నారు. ‘మీరు సంతకాలు పెట్టండి, అంతా అధికారులు చూసుకుంటారు’ అని ఓ కీలక నిర్వహకుడు బహిరం గంగా వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. 55 మందిలో మెజారిటీ సభ్యులు యజమాన్యంలో కీలకంగా ఉన్నవారి బంధువులు ఉన్నారు. అందులో సగం సంతకాలు పెట్టించుకుని, మరి కొందరిని బెదిరించి, మీరు సంతకం పెట్టకుంటే, మిమ్మల్ని స్థానికేతరులని తీర్మానం చేసి,  సొసైటీ నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది.

గతం నుంచి అదే కథ..

ఈ అక్రమాల విషయంలో గతంలో గొడవలు జరిగి, పోలీసు కేసుల వరకు వెళ్లినా యాజమాన్యం తీరు మారలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సహకార చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తారా, లేక ఎప్పటిలాగే యాజమాన్యంతో బేరాలు కుదుర్చు కుని కార్మికుల పొట్టకొడతారా అని గీతా కార్మికులు, గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు రావలసిన బకాయిలు ఇప్పించి, ఈ యాజమాన్యం వేధింపుల నుండి విముక్తి కల్పించాలని వారు కోరుతున్నారు.

‘విజయ క్రాంతి‘నే కొనాలని..

మూడవ కల్లు డిపోకు చెందిన ప్రతినిధులు నలుగురు బుధవారం విజయ క్రాంతి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిని కలిశారు. ఎక్సైజ్ ఈఎస్, సీఐలకు ఫోన్ చేయాలని ప్రాధేయపడ్డారు. నిన్ను మంచిగా చూసుకుంటామని, ఏమైనా కావాలన్నా అడ్జస్ట్ చేస్తామని, మాపై వార్తలు మాత్రం రాయొద్దని కాళ్ళ బేరానికి దిగారు. కార్మికులు, సభ్యులకు న్యాయం చేస్తే తప్పా, విజయ క్రాంతి వెనక్కి తగ్గదని స్పష్టం చేసింది. అర్హులకు న్యాయం, ఆ తర్వాత  అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే డిపో మనుగడకు విజయ క్రాంతి అండగా నిలబడుతుందని హమీ ఇచ్చింది. దీంతో డిపో ప్రతినిధులు తోక ముడిచారు. విజయ క్రాంతి ఎల్లప్పుడు బాధితుల పక్షమని  తెలుసుకున్నారు. అతితెలివితో  విజయ క్రాంతిని బద్నాం చేయాలనే వారి ఎత్తుగడ బెడిసికొట్టింది.