calender_icon.png 22 November, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటక సంక్షోభానికి తెరపడినట్టేనా!?

22-11-2025 12:59:01 AM

-మరో రెండున్నరేళ్లు సీఎం పీఠం సిద్ధరామయ్యదే..

-అధిష్ఠానం నుంచి సంకేతాలు

బెంగళూరు, నవంబర్ 21 : ‘కడుపులో కత్తులు పెట్టుకుని పైకి నవ్వులు చిందించడం’ చందంగా కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయం సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘మరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరమయ్యే కొనసాగుతారు.. ఆయనకు మేము పూర్తిగా సహకరిస్తాం’ అంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించడం.. మరో వైపు 2023లో ఎన్నికల అనంతరం కుదిరిన ఒప్పందం ప్రకారం నాయకత్వ మార్పిడి కోసం డీకే వర్గం ఢిల్లీకి వెళ్లి పట్టుబడుతుండటం.. కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టేనా!? లేక ముదురుతోందా? అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అలాంటిదేమీ లేదని అధిష్టానం నుంచి సంకేతాలు, ఇంకోవైపు సామాజిక మాధ్యమాల్లో డీకే శివకుమార్ అర్థంకాని పోస్టులతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. 

రెండున్నరేళ్లు పూర్తికావడంతో..

కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్ధరామయ్య, డీకే వర్గాలు గట్టిగా పోటీ పడడంతో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఎవరూ పట్టు వీడకపోవడంతో చెరో రెండున్నరేళ్లు ప్రతిపాదన తెచ్చి ముందుగా సిద్ధరామయ్యను సీఎంను చేసేలా అధికార ఒప్పందం జరిగింది. అప్పటికి ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే శివకుమార్ సర్దుకున్నారు. గురువారంతో సిద్ధరమాయ్య పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తి కావడంతో తమ నేతను సీఎం చేయాలని డీకే వర్గం మద్దతదారులు ఢిల్లీలో మకాం వేశారు. 

నేనే కొనసాగుతా : సిద్ధరామయ్య

మిగతా రెండున్నరేళ్లు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అధికార మార్పి డి లాంటిది లేదని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని.. తాను కొనసాగుతానా? లేదా? అన్నది అప్రస్తుత చర్చ అని పేర్కొంటున్నారు. నవంబర్ విప్లవం అంటూ సాగుతున్న ప్రచారం మీడియా కల్పితమే అంటూ కొట్టిపారేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ తానే బడ్జెట్ ప్రవేశపెడతానని స్పష్టం చేశారు.  

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పారు. ఆయనకు మేమంతా అభినందనలు తెలియజేస్తు న్నాం. ఆయనతో కలిసి పని చేస్తాం. సీఎం అయినా.. నేనైనా చెప్పేది ఒక్కటే హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం’. అని  డీకే శివకుమార్ ఎక్స్‌లో పోస్టు చేశారు.