17-12-2025 01:26:58 AM
వికారాబాద్, డిసెంబర్- 16: వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు చేజారుతుందా......? నాయకుల మధ్య నెలకొన్న అధిపత్య పోరు పార్టీకి నష్టం చేయనుందా......? స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తo హవ కొనసాగినప్పటికీ నాయకుల మధ్య నెలకొన్న వైరం రానున్న రోజుల్లో పార్టీకి గడ్డుకాలం తెచ్చి పెట్టనుందా......? అంటే అవుననే మాటనే వినిపిస్తుంది. వికారాబాద్ నియోజకవర్గం జిల్లా కేంద్రంలో గత రెండు ఏళ్లుగా ఎక్కడో ఒకచోట నేతల మధ్య గొడవలు బయటపడుతూనే ఉన్నాయి.
ఏకంగా స్పీకర్ సమక్షంలోనే వేదికలపై నేతలు తగాదాలకు దిగడం ద్వితీయ శ్రేణి నాయకులను ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలా ఏళ్లుగా పార్టీలో ఉంటూ గడ్డుకాలంలో పార్టీని నిలబెట్టిన నాయకులు కొందరైతే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పార్టీ విజయం కోసం శక్తికి మించి పని చేసిన నాయకులు కొందరు ఉన్నారు. అయితే చాలా రోజులుగా ఈ రెండు గ్రూపుల నాయకులకు పడటం లేదు.
సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్లెక్సీ ల పై ఫోటోలు చింపుకున్న ఇరు వర్గాల నాయకులు మాత్రం చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వారే గమనర్హం. ప్లెక్సీలో ఫోటోలు తొలగించుకోవడం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల గ్రూపు తగాదాలకు అద్దం పడుతుంది. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పార్టీ హైకమాండ్ మెతక వైఖరి వహించడంతోనే నాయకులు క్రమశిక్షణ తప్పుతున్నారనే విషయాన్ని సొంత పార్టీ నాయకులే చెప్పుకోవడం సోచనీయం.
స్థానిక సంస్థల ఎన్నికలతో బయటపడ్డ తగాదాలు...
గత కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య వైరం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో బయటపడింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలతో రోడ్డు ఎక్కడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ఆదివారం రెండో విడత స్థానిక సంస్థల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే ప్లెక్సీలో ప్రత్యర్థుల ఫోటోలు తొలగించుకునే స్థాయికి చేరింది.
అయితే సోమవారం వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు కొందరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ప్లెక్సీలలో ప్రధాన రోడ్డుపై ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఫోటోలను తొలగించారు. సుధాకర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీ ల నుండి సుధాకర్ రెడ్డి ఫోటోలను ఎందుకు తొలగిస్తున్నారో చాలా సేపటి వరకు ఎవరికీ అర్థం కాలేదు.
ఈ విషయంపై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత గ్రామం మదన్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తన తల్లి సర్పంచిగా పోటీ చేసినట్లు తెలిపారు. పోటీలో నిల్చున్న నాటి నుండి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తన తల్లిని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు ఆరోపించారు. తన గ్రామానికి చెందిన అనేకమంది నాయకులతో ఓ ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేసి మా అమ్మను ఓడించాల్సిందిగా ఉపన్యాసాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని స్పీకర్ చెప్పిన సుధాకర్ రెడ్డి పెడచెవిన పెట్టినట్లు ఆరోపించారు.
ఒకే పార్టీలో ఉంటూ సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి ప్రయత్నించిన సుధాకర్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సుధాకర్ రెడ్డికి తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని డిసిసిపి పదవికి తాను దరఖాస్తు చేసుకోవడంతోనే తనపై కోపం పెంచుకున్నారని గుర్తు చేశారు. ఒకే పార్టీలో ఉంటూ సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలో చేయడం సమంజసం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు హైకమాo డ్ కు మరో మారు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఫ్లెక్సీలు చింపడం పై విమర్శలు.....
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద, ప్రధాన రోడ్డులో ని ఫ్లెక్సీలలో సొంత పార్టీ నాయకుల ఫోటోలను చింపడం సమంజసం కాదనే విమర్శలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య నెలకొన్న సమస్యను అంతర్గతంగా స్పీకర్ వద్ద పరిష్కరించుకోవాల్సి ఉండేనని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బహిరంగంగా ఫ్లెక్సీలు చింప డంతో పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభద్రత భావంతోనేనా....?
వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు పది ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. ఈ గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పార్టీని కాపాడేందుకు ఎంతగానో కృషి చేయడంతో పాటు సొంత నిధులను పార్టీ కోసం ఖర్చు చేశాడనే విషయం పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు బలంగా నమ్ముతారు. వికారాబాద్ లో ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం స్పీకర్ పదవి దక్కడంతో సుధాకర్ రెడ్డి కూడా పార్టీలో మంచి గౌరవమే ఉంది.
స్పీకర్ సైతం పార్టీ పరమైన కార్యక్రమాలు సుధాకర్ రెడ్డి కి మొదటి నుండి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా వికారాబాద్ డిసిసిపి పదవి దక్కుతుందని ఆయన వర్గీయులు బలంగా నమ్మారు. కానీ జిల్లా అధ్యక్ష పదవి దక్కకపోవడం ఒకింత నిరాశ కలిగించిందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే చోటు చేసుకుంటున్న చిన్నచిన్న గ్రూపు తగాదాలు పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. స్పీకర్ వద్ద తన స్థానాన్ని ఎవరు లాగేసుకుంటారో ననే అభద్రతాభావంతో, సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో స్పీకర్ సమక్షంలో నే బహిరంగ ఆరోపణలకు దిగ డం ఆయనకు చెడు చేసి పెడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.