ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం
30 మందిని నమ్మించి రూ.10 లక్షలతో పరార్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో స్వీపర్ ఉద్యో గాలు ఇప్పిస్తానని 30 మందిని మోసం చేసిన వ్యక్తిపై ఖైరతాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో ఉద్యోగావ కాశాలు ఉన్నాయని ఆసిఫ్‌నగర్‌కు చెందిన సాయికుమార్ తన మిత్రుల ద్వారా సికింద్రాబాద్‌కు చెందిన కళావతికి తెలియజేశాడు. ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రాజశేఖర్ అనే సూపర్‌వైజర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నట్లు నమ్మబలికాడు. రిజిస్ట్రేషన్ నిమిత్తం తొలుత రూ.10 వేలు, ఐడీ కార్డు ఇచ్చినపుడు రూ.15 వేలు, ఉద్యోగంలో చేరినప్పుడు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని సూచించాడు.
దీంతో నగరానికి చెందిన 30 మంది అతడికి ఒక్కొక్కరు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించారు. దీంతో వారికి సూపర్‌వైజర్లుగా, స్వీపర్లుగా గుర్తింపు కార్డులు ఇచ్చాడు. వారితో రవీంద్రభారతి పరిసరాల్లో పది రోజుల పాటు స్వీపింగ్ కూడా చేయించాడు. తర్వాత వారికి దూరంగా ఉండటంతో అనుమానం వచ్చి ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రాజశేఖర్ అనే సూపర్‌వైజర్ కోసం ఆరా తీశారు. అలాంటి వారెవరూ లేరని చెప్పడంతో మోసపోయామని గ్రహించిన కళావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.






