23-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలన్న బీఆర్‌ఎస్ నిర్ణయాన్ని తప్పుబడుతూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కు దూరంగా ఉండాలని, తమ పార్టీ వారు ఓటు వే యకూడదని ఆదేశాలివ్వడం ఏరకంగా సమర్థనీయమని ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ అధ్యక్షుడు ఎమ్. పద్మనాభరెడ్డి మంగళవారం విడదల చేసిన లేఖలో ప్రశ్నించారు.
స్వచ్ఛంద సంస్థలు ఎలక్షన్ వాచ్ గ్రూప్‌గా ఏర్పడి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని బీఆర్‌ఎస్ తమ పార్టీ వారిని హెచ్చరించినట్లు పత్రికల్లో వార్తలు చూశామని, ఈ విధంగా తమ కార్పొరేటర్లకు ఆదేశాలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు.
భారత న్యాయ సంహిత చట్టం 2023 సెక్షన్ 169 ప్రకారం ఎవరినైనా ఓటు వేయవద్దనడం అపరాధమని చెప్పారు. ఈ అంశాలను గుర్తుపెట్టుకొని భారత ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.