calender_icon.png 22 June, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీగా కథ చెప్పడం మా ధర్మం

22-06-2025 12:00:00 AM

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజాచిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావు నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా తొలి ఆట నుంచే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్న సందర్భంగా మేకర్స్ శనివారం సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “యునానిమస్‌గా సినిమా అందరికీ నచ్చింది. సుమంత్, చైతన్య, అమల.. వీళ్లంతా పనిచేయడానికి ముందు నుంచే శేఖర్‌తో పనిచేయాలని ఉండేది నాకు. శేఖర్ కూడా ‘మీతో ఒక స్టైలిష్, ఫ్యామిలీ సినిమా చేయాలని ఉందని’ చెప్తుండేవారు. ఫైనల్‌గా మా కాంబినేషన్‌లో ‘కుబేర’ వచ్చింది. ఇది బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఎప్పటినుంచో ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది. శేఖర్ సినిమాలన్నీ చూశా. ఆయన క్యారెక్టర్‌కు అద్భుతంగా న్యాయం చేస్తారు. ఈ కథ వినగానే నాది మెయిన్ కరెక్ట్ అనిపించింది.

ప్రతి పాత్ర కూడా నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ కథ వినగానే ఇది దీపక్ కథ అనిపించింది. శేఖర్ కూడా దీన్ని అలానే చెప్పారు. ఈ క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. మిగతా క్యారెక్టర్ ఆర్క్స్ ఒకేలా ఉంటాయి. కానీ దీపక్ క్యారెక్టర్‌లో త్రీ షేడ్స్ ఇచ్చారు. అందుకే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి ఓకే చెప్పా. నా క్యారెక్టర్‌కు వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్నిచ్చింది. ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’, ‘గుండమ్మ కథ’.. ఈ అన్నిట్లో హీరో ఎవరని చెప్పలేం. కథే హీరో.. అవన్నీ డైరెక్టర్ ఫిలిమ్స్. కుబేర కూడా అవుట్‌అండ్‌అవుట్ శేఖర్ కమ్ముల ఫిలిం. ఈ సినిమా కోసం ప్రాణం పోశారు” అన్నారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతిదేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీరీలీజ్ ఈవెంట్లో చెప్పా. అది నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం. ఇంత కొత్తగా జెన్యూన్‌గా సినిమా తీసినప్పుడు చాలా లేయర్స్ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో కాస్త లెంత్ ఉండవచ్చు. కానీ ఇది చెప్పాల్సిన విషయం. కచ్చితంగా చెప్పి తీరాలి. ఒక పాయింట్‌ను నిజాయితీగా చెప్పడమే మా ధర్మం.

మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కూడా కొత్తగా కనిపిస్తాయి. ఈ యునానిమిస్ రిపోర్ట్‌తో చాలా గర్వంగా ఉంది. ఇది ఒక కంప్లీట్ ఫిలిం” అని చెప్పారు. నిర్మాత సునీల్ నారంగ మాట్లాడుతూ.. “ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను. శేఖర్ కమ్ముల గ్రేట్ డైరెక్టర్. ఫ్యూచర్‌లో కూడా ఆయన అన్ని సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. నాగార్జున సపోర్ట్‌తోనే సినిమాను అనుకున్న సమయంలో రిలీజ్ చేయగలిగాం” అని తెలిపారు. ‘మేము చాలా ఆనందంగా ఉన్నాం. శేఖర్ అద్భుతమైన సినిమా ఇచ్చారు’ అని మరో నిర్మాత పుస్కుర్ రామ్మోహన్ అన్నారు.