నగరాన కురిసింది వాన!
హైదరాబాద్ సిటీ బ్యూరో/ ఖమ్మం, జూన్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ప్రధానమార్గాలు ముంపునకు గురయ్యాయి. తక్షణం రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసీ డిజాస్టార్ రెస్క్యూ బృందాలు రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించారు. నేలకొరిగిన చెట్లు, చెట్ల కొమ్మలను రహదారులకు అడ్డుగా లేకుండా తొలగించారు. చెట్ల కొమ్మ లు విరిగి రోడ్లపై పడిన సమస్యపై 10 ఫిర్యాదులు, రోడ్లపై నీరు నిల్వడంతో తొమ్మిది ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీకి అందాయి. అత్యధికంగా సైదాబాద్‌లో 4.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పలంగా మారేడ్‌పల్లిలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.






