సింగరేణిని దోపిడీ కేంద్రంగా మార్చింది బీఆర్‌ఎస్సే
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
- హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జూన్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిని సర్వనాశనం చేసిన వారే.. ఇప్పుడు దాని పరిరక్షకులుగా మాట్లాడటం హరీశ్‌రావు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మార్చే సంస్కృతి ఈ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబానికే అలవాటైందని ఘాటుగా విమర్శించారు.
భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిని ఆదాయ వనరుగా కాకుండా, దోపిడీ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. అందినకాడికి దోచుకుని, ఇప్పుడు సింగరేణి కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మాట్లాడటం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనన్నారు. భూపాలపల్లికి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును రాజకీయ ప్రయోజనాల కోసం యాదాద్రికి తరలించారని ఆరోపించారు.
ప్రాజెక్టు వ్యయాలను అమాంతం పెంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. నాసిరకం సామగ్రి, అవినీతి నిర్మాణాలతో ప్లాంటును పనికిరాని స్థితికి చేర్చారన్నారు. అలాగే సింగరేణి పరిధిలోని ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్టీ, సీఎస్‌ఆర్ నిధులను సిద్ధిపేట, హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు తరలించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు భూపాలపల్లి పర్యటనలో సింగరేణిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణిని బలహీనపరిచిన వారే ఇప్పుడు దాని గురించి నీతులు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. సమా వేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,టౌన్ అధ్యక్షుడు దేవన్,కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






