14 June, 2026 | 1:44 AM

ఆదివాసీల కట్టుబాట్లు ఆదర్శం

14-06-2026 12:03 AM
  1. గోండి భాష నేర్చుకుంటా
  2. మంత్రి జూపల్లి కృష్ణారావు
  3. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి 

ఆదిలాబాద్/ఉట్నూర్, జూన్ 13 (విజయక్రాంతి): ఆదివాసీల ఆచారాలు, సంప్ర దాయాలు దేశానికే ఆదర్శమని, గోండుల సంస్కృతి సాంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకోవడంతో పాటు గోండి భాషను తాను నేర్చుకుంటానని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో ఆయన పర్యటించారు.

34 ఏళ్ల క్రితం అనాడు మంత్రి కోట్నాక్ భీం రావ్ పర్యటించగా, ఇప్పుడు మంత్రి జూపల్లి పర్యటించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దీంతో గ్రామస్థులు ఆనందంగా మంత్రికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు బహూకరించారు.

అనంతరం మావల మండలంలోని బట్టి సావర్గామలో 1.43 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రస్తుత ప్రజా పాలన ప్రభుత్వం రూ. 75 వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తుందని గుర్తు చేశారు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తూనే, ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే పేద ప్రజలకు పథకాలు అందిస్తున్నామన్నారు. 

రాష్ట్రంలో ఏ గూడానికి వెళ్లిన ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుందని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామని, ఒంటరి మహిళలకు సైతం మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రిమ్మ గ్రామంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రతిపాదనల మేరకు పైలట్ గ్రామంగా ఎంపిక చేసి ఒక్క 152 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు.ఆదివాసీ గిరిజనులు తమ పిల్లలను చదివించాలని సూచించారు.

గ్రామస్తుల విన్నపం మేరకు 10 లక్షలతో  గ్రంథాలయమును ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించడంతో పాటు తన పర్యటక శాఖ తరపున 10 లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలను అందచేస్తామని హమీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెందుర్ జంగుబాయి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన, మండల ప్రత్యేక అధికారి పాణిందర్ రావు, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.