సురవరం జీవిత చిత్రం స్ఫూర్తిదాయకం
మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): తెలంగాణ వైతాళికుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ సంపాదకుడు సురవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సురవరం’ చలనచిత్రం స్ఫూర్తిదాయకంగా ఉందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో మంగళవారం ‘సురవరం’ బయోపిక్ ప్రివ్యూను ప్రదర్శించారు.
చిత్రాన్ని వీక్షించిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజల దుస్థితి, హక్కుల కోసం సాగిన పోరాటాన్ని సినిమాలో చక్కగా చూపించారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈ చిత్రాన్ని వీక్షించి చరిత్రను తెలుసుకోవాలని కోరారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ నిజాం కాలంలో తెలుగు భాష, విద్యకు ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన తీరును సినిమాలో ప్రతిబింబించారని అన్నారు.
నాటి చరిత్రను నేటి తరం తెలుసుకోవడానికి ‘సురవరం’ చిత్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు, ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కొండా లక్ష్మీకాంత్ రెడ్డి, డా. గురువారెడ్డి, దర్శకులు బి.ఎం. రెడ్డి, జి. హర్షవర్ధన్ రాయల్, రచయిత బి. విజయ ప్రసాద్, సురవరం కుటుంబ సభ్యులు డా. సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సురవరం కపిల్, సురవరం గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






