16 May, 2026 | 2:50 AM

అర్హులకు ఇల్లు ఇస్తే బాగుండేది

16-05-2026 01:21 AM

చిన్నచింతకుంట, మే 15 : ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇస్తే బాగుంటుందని అక్రమాలకు తాగు లేకుండా చేస్తే మరింత బాగుండేదని బిఆర్‌ఎస్ నేత బసిరెడ్డి సంతోష్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను దారుణంగా మోసం చేస్తోందని విమర్శించారు. అర్హులకు అన్యాయం చేస్తూ అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

దేవరకద్ర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకత లోపించిందన్నారు.గ్రామ సభలను సక్రమంగా నిర్వహించకుండానే, కాంగ్రెస్ నాయకులు తమ అనుచరుల పేర్లను జాబితాలో చేర్చుకున్నారని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులకే పెద్దపీట వేస్తూ నిజమైన పేదలను విస్మరించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని ఆయన పేర్కొన్నారు.మండలంలో 482 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, కేవలం 69 ఇండ్లు మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మాణం అయ్యాయని ఆరోపించారు.

ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి అదనపు ఆర్థిక సాయం అందించాలని, అర్హత ఉండి తొలగించబడిన 111 మంది పేర్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే, పేదల పక్షాన నిలబడి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.