16 May, 2026 | 2:48 AM

నల్లగొండ ఎఫ్‌సీఐలో అగ్ని ప్రమాదం

16-05-2026 01:20 AM

కీలక ఫైల్స్ దగ్ధం? 

ప్రమాదమా.. ఏమైనా కుట్రకోణమా!

నల్లగొండ, మే 15 (విజయక్రాంతి): నల్లగొండ ఎఫ్‌సీఐ గోదాంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించి, మూడు గదుల్లో ఉన్న కీలక ఫైల్స్ దగ్ధం అయినట్టు తెలుస్తున్నది. అయితే ఈ ప్రమాదం వెనుక అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ సరఫరా లేనప్పుడు ఎలా షార్ట్ సర్క్యూ ట్ జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దగ్ధమైన ఫైల్స్‌లో సీబీఐ కేసులు, ఆర్‌టిఐ ఫిర్యాదులు, ప్యాడి ప్రోక్యూర్ మెంట్, సిఎంఆర్ రికార్డులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 7 మిల్లులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

చెన్నై జోనల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజిలెన్స్ ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులు, కేసుల నుంచి తప్పించుకునేందుకు ఫైళ్లను దగ్ధం చేశారా అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. డీఎం సుకుమార్ మాత్రం పాత రికార్డులేనని, వాటన్నిటిని కంప్యూటరైజ్డ్ చేశామని చెప్పారు. గురువారం రాత్రి రికార్డుల గది తలుపులు తెరిచేందుకు వీలు కాకపోవడంతో జేసీబీ సహాయంతో తలుపులను తొలగించి మంటలను ఆర్పారు.