ఐటీసీ నికరలాభం రూ. 5,120 కోట్లు
ముంబై, మే 23: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కన్సాలిడేటెడ్ నికరలాభం మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే 2024 మార్చితో ముగిసిన క్యూ4లో 1 శాతం క్షీణించి రూ. 5,120 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 5,175 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో ఐటీసీ ఆదాయం 2 శాతం పెరిగి రూ. 19,446 కోట్లకు చేరింది. నిరుడు క్యూ4లో ఇది రూ. 19,058 కోట్లు. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.7.50 చొప్పున తుది డివిడెండు సిఫార్సు చేసింది. డివిడెండు చెల్లింపునకు జూన్ 4 రికార్డుతేదీగా నిర్ణయించారు. అయితే జూలై 29 మధ్యలో చెల్లిస్తారు. స్టాండెలోన్ ప్రాతిపదికన ఐటీసీ క్యూ4లో రూ. 5,020 కోట్ల నికరలాభాన్ని, రూ. 6,379 కోట్ల ఇబిటాను ఆర్జించింది.
సిగరెట్ల వ్యాపారం 7 శాతం వృద్ధి
విభాగాల వారీగా చూస్తే కంపెనీ సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం పెరిగి రూ.8,689 కోట్లకు పెరిగింది. ఈ వ్యాపారం పన్నుకు ముందు లాభం 5 శాతం వృద్ధిచెంది రూ.5,157 కోట్లుగా నిలిచింది. ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ, ఇతర వ్యాపారాల ఆదాయం కూడా 7 శాతం పెరిగి రూ. 5,308 కోట్లకు పెరిగినప్పటికీ, పీబీటీ మాత్రం 5 శాతం క్షీణించి రూ. 480 కోట్లకు పడిపోయింది. హోటల్స్ వ్యాపారం ఆదాయం, పీబీటీలు 15 శాతం, 34 శాతం చొప్పున పెరిగాయని ఐటీసీ తెలిపింది. వ్యవసాయోత్పత్తులపై నియంత్రణలు ఉన్నందున ఆగ్రి బిజినెస్ ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించిందని కంపనీ వివరించింది. పేపర్‌బోర్డ్స్, ప్యాకేజింగ్ వ్యాపారాల ఆదాయం సైతం అంతర్జా తీయ మార్కెట్లో చైనా డంపింగ్ కారణంగా 13 శాతం తగ్గినట్టు ఐటీసీ తెలిపింది.






