12-12-2025 12:00:00 AM
భద్రాచలం, డిసెంబర్ 11, (విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గం లోని భద్రాచలం గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు కల్పించిన సదుపాయాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం భద్రాచలం పట్టణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలు బిఈడి కాలేజ్, నన్నపనేని హై స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన అన్నారు. ఉదయం నుంచే ఓటర్లలో చైతన్యం వెల్లివిరుస్తున్నదని, అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారని, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం1:00 గంట వరకు మాత్రమే సమయం ఉన్నదని, ఓటర్లు సమయం మించిపోయే వరకు వేచి ఉండకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాలకు విచ్చేసి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ఓటర్లకు సూచించారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతున్నదని పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకుని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా త్వరగా ఓటు వేయించి పంపించాలని, వయోవృద్ధులు, వికలాంగులకు వాలంటీర్ సహాయంతో ఓట్లు వేయించాలని సిబ్బందికి సూచించారు.
పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల కొరకు ఏర్పాటుచేసిన వసతి సౌకర్యాల గురించి ఓటర్లను అడిగి తెలుసుకున్నారు.భద్రాచలంలో గురువారం నాడు జరిగిన గ్రామపంచాయతీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న పోలింగ్ సిబ్బంది సహకారంతో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముగించడం జరిగిందని, 60 పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించిన పిఓలు, ఓపిఓలు, రూట్ ఆఫీసర్లు మరియు ఇతర సిబ్బంది బాధ్యతతో తమకు అప్పగించిన పనులను సమర్ధవంతంగా నిర్వహించడంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం సిబ్బందికి సహకారం అందించి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోలింగ్ సామాగ్రి పంపిణీ సందర్భంగా పోలింగ్ వీధులలో పాల్గొనే అధికారులు వారి సిబ్బందిని తీసుకుని సకాలంలో వివిధ పోలింగ్ స్టేషనులకు సురక్షితంగా చేరుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని, సమయాన్నికూలంగా ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించి తిరిగి కౌటింగ్ కేంద్రాలకు తీసుకొని రావడానికి సహకరించిన వివిధ పోలింగ్ స్టేషన్లోని వార్డు ప్రజలకు మరియు పోలింగ్ ఏజెంట్లకు అలాగే ప్రత్యేక రక్షణ కల్పించిన పోలీసులకు, సామాగ్రి తరలించడానికి తిరిగి తీసుకోని రావడానికి అహర్నిశలు పనిచేసిన గ్రామపంచాయతీ సిబ్బందికి, వాలంటీర్స్ అందరికీ పేరుపేరునా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎంపీడీవో నారాయణ, తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, జిపిఈఓ శ్రీనివాస్ మరియు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.