16-02-2026 12:22:38 AM
8వవార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ మంచే శంకరయ్య సోదరుడు మంచే సత్తయ్య
మొయినాబాద్, ఫిబ్రవరి 15(విజయ క్రాంతి): చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తన తమ్ముడిని కిడ్నాప్ చేయడం సరికాదని, వెంటనే తన తమ్ముడిని తమ కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలి. లేకుంటే కుటుంబ సభ్యులందరం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, బీఆర్‌ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ మంచే శంకరయ్య సోదరుడు సత్తయ్య పేర్కొన్నారు. ఇటీవలే మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ 8వ వార్డు అభ్యర్థి మంచే శంకరయ్య గెలుపొందారు.
చైర్మన్ పదవి కోసం ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో పడ్డారు. మంచే శంకరయ్యను కాంగ్రెస్ కిడ్నాప్ చేయడం సరికాదని, ఆదివారం మంచే శంకరయ్య నివాసంలో కుటుంబ సభ్యులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచే సత్తయ్య మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ పార్టీ మాపై నమ్మకంతో బిఫామ్ ఇచ్చిందని బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై తన తమ్ముడి కోసం కష్టపడి ప్రజల ఆశీస్సులతో గెలిచామన్నారు.
గెలిచిన తర్వాత వార్డు ప్రజలను కలవడానికి వెళ్తే అడ్డదారిలో తన తమ్ముడిని కాంగ్రెస్ వాళ్లు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ చైర్మన్ పదవి కోసం ఇలా తన తమ్ముడిని కిడ్నాప్ చేయడం సరికాదన్నారు. మా కుటుంబం పరువు పోతుంది. ప్రజలు మమల్ని నమ్మే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వార్డు ప్రజలు అడుగుతున్నారని, వెంటనే తన తమ్ముడిని అప్పజెప్పాలన్నారు. లేకుంటే కుటుంబ సభ్యులందరం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.