జనగామ పేరు మార్పుపై ఆందోళన
పేరు మార్చొద్దంటున్న జేఏసీ
పాపన్నగౌడ్ పేరుకు గౌడసంఘాల సమర్థన
సీఎం రేవంత్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు
సీఎం దిష్టిబొమ్మ దహనం
జనగామ, మే 22 (విజయక్రాంతి): జనగామ జిల్లా పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. జిల్లా పేరును ‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్’గా మారుస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనగామ పేరుకు చారిత్రక నేపథ్యం ఉన్నందున ఆ పేరునే కొనసాగించాలని కొందరు అంటుండగా.. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టడంపై మరికొందరు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసినప్పుడు జనగామను ముక్కలుగా విభజించి మూడు జిల్లాల పరిధిలో కలిపారు. అప్పటికే జనగామ ప్రత్యేక జిల్లా ఉద్యమం సాగుతోంది. దీంతో రెండో దశలో అప్పటి సీఎం కేసీఆర్ జనగామ జిల్లా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జైనులు నడయాడిన నేలగా చారి త్రక నేపథ్యం ఉన్న జనగామ పేరును మార్చ డం సరికాదని కొందరు పేర్కొంటున్నారు. మరోవైపు గౌడ కుల సంఘాలు మాత్రం మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాంచి కేం ద్రంగా కోటను నిర్మించుకుని ఈ ప్రాంతానికి వన్నె తెచ్చిన సర్దార్ సర్వాయి పాప న్నగౌడ్ పేరు పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నారు.
సీఎం నిర్ణయంపై ఆందోళనలు
జనగామ పేరు మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని ఖండిస్తూ కొందరు ప్రకటనలు విడుదల చేశారు. బుధవారం జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు డిమాండ్ చేశారు. ‘రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. మా జిల్లా జోలికి వస్తే ఊరుకోం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో జేఏసీ నాయకులు గన్ను కార్తీక్, నల్ల రాహుల్, తుంగ కౌశిక్, వెంపటి అజయ్, గద్ద సాయికుమార్, సల్ల మహేశ్, మద్దెల కార్తీక్, చిటుకుల అశోక్, అఫ్రోజ్, దినేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
పాపన్న పేరు పెట్టడం హర్షణీయం
రాచరిక వ్యవస్థపై పోరాడి రాజ్యాధికారం సాధించిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పాపన్నగౌడ్‌ను చూడొద్దు. గోల్కొండ కోటను వశం చేసుకుని పరిపాలన చేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి పాపన్న. జిల్లాకు ఆయన పేరు పెడితే బహుజనులందరికీ గౌరవం దక్కినట్టే. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
- బూడిద గోపి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి






