జగ్గారెడ్డికి మతిభ్రమించి ఆరోపణలు
అబద్దాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు
హరీష్‌రావును విమర్శిస్తే ఊరుకునేది లేదు...
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి, ఆగస్టు 11 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, జగ్గారెడ్డి చెప్పిన అబద్దాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దుయ్యబట్టారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్రావును విమర్శించే నైతిక హక్కు జగ్గారెడ్డికి లేదన్నారు. హరీష్రావు కాలిగోటికి కూడా జగ్గారెడ్డి పనికిరాడని తెలిపారు. గెలిచిన ప్రతీసారి ముఖం చేటేసి, తన కుటుంబం కోసం ప్రజలను మోసం చేయడం జగ్గారెడ్డికి అలవాటన్నారు. సంగారెడ్డికి సీఎం వస్తున్నందున ఏ హోదాలో ముఖ్యమంత్రితో వేదిక పంచుకోవాలో అర్థంగాక ప్రస్టేషన్లో హరీష్రావుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసైన్డ్ భూములను దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి లేదన్నారు. గతంలో జగ్గారెడ్డి చేసిన అవినీతి వల్ల ఆరుగురు అధికారులు బలయ్యారని గుర్తు చేశారు. హరీష్రావును విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కేసు పెట్టారని హరీష్రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని, జగ్గారెడ్డిని ప్రజలు క్షమించే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, జైపాల్రెడ్డి, డాక్టర్ శ్రీహరి, కొండల్రెడ్డి, రాజేందర్రెడ్డి, శ్రవణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






