calender_icon.png 16 January, 2026 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

16-01-2026 11:35:50 AM

స్ఫూర్తిస్థల్ వద్ద ఎమ్మెల్యే కశిరెడ్డి ఘన నివాళులు

ఆమనగల్లు,(విజయక్రాంతి): విలక్షణ రాజకీయవేత్త, మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్ రెడ్డి 84 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని 'స్ఫూర్తిస్థల్' వద్ద నేతలు, జైపాల్ రెడ్డి అభిమానులు ఘన నివాళులు అర్పించారు.  కల్వకుర్తి ఎమ్మెల్యే  కశిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి, ఆయన సోదరులు రామిరెడ్డి, పద్మా రెడ్డి, కుటుంబ సభ్యులు, కల్వకుర్తి నియోజకవర్గం లో ని వివిధ పార్టీ ల నాయకులు తరలివచ్చి జైపాల్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

విలువల రాజకీయాలకు నిలువుటద్దం

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి  మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి గారి గొప్పతనాన్ని కొనియాడారు. ​నిబద్ధత కలిగిన నేత అని,పదవుల కంటే విలువలకు ప్రాధాన్యతనిచ్చిన గొప్ప పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారని ఆయన పేర్కొన్నారు.​ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, సంక్లిష్టమైన అంశాలను సైతం లోతుగా విశ్లేషించగల మేధావి అని కొనియాడారు.

​భావి తరాలకు స్ఫూర్తి

ఆచారి మాట్లాడుతూ  జైపాల్ రెడ్డి భావి తరాలకు స్ఫూర్తి అని ప్రతీ అంశం పై లోతైన అవగవాన కనబరిచిన వాగ్ధాటి, రాజకీయ పరిపక్వత నేటి యువ నాయకులకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ మచ్చలేని నేతగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆయన పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ​జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో స్ఫూర్తిస్థల్‌కు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. దేశానికి మరియు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "జైపాల్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎప్పుడూ సజీవంగా ఉంటాయి" అని నేతలు అభివర్ణించారు.