16-01-2026 12:46:38 PM
తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో(Supreme Court) శుక్రవారం విచారణ జరిగింది. ఈకేసులో సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker) తీసుకున్న చర్యలపై నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచారు. ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరిపామని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ జరిపి తీర్పు వెలువరించారని సింఘ్వీ వెల్లడించారు.
మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ తరుపు న్యాయవాది సింఘ్వీ కోర్టును నాలుగు వారాల గడువు కోరారు. రెండు వారాల్లో పురోగతి చూపిస్తే 4 వారాల సమయం ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ స్పీకర్ పై సుప్రీం సీరియస్ అయింది. స్పీకర్ కు ఇదే చివరి అవకాశమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం.. ఈపాటికి నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదిని తెలిపింది. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.