తెలంగాణ దిక్సూచి జయశంకర్
నేడు ఆచార్య జయశంకర్ సార్ జయంతి
తెలంగాణ సిద్ధాంతకర్త, నిస్వార్థ త్యాగశీలి, రాష్ట్ర సాధన కోసం అస్తిత్వ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన ధీశాలి ఆచార్య జయశంకర్. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసినా ప్రజా ఉద్యమ స్వప్నాన్ని మరువని నిబద్ధత ఆయనది. ఆర్‌ఎస్‌యూ నుంచి, ఆర్‌ఎస్‌ఎస్ వరకు తెలంగాణ వాదుల్ని ఏకం చేసిన మహోన్నతుడు. ఒక ఉద్యమం, ఒక తత్వం, ఒక చైతన్యంతో ప్రత్యేక తెలంగాణకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. అధికార పదవులకు, వ్యక్తిగత ప్రయోజనాలకు, రాజకీయ లాభాల కోసం కాకుండా ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయంపాలన కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు.
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామం వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం అక్కంపేట. లక్ష్మీకాంతాచారి, మహా లక్ష్మమ్మ దంపతులకు 1934 ఆగస్టు 6న ఆయన జన్మించారు. తనకంటూ వ్యక్తిగత జీవితం ఏమీ లేదు. ఏనాడూ తన గురించి ఆలోచించలే దు. విద్యార్థి దశలోనే సామాన్య కార్యకర్తగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దిక్సూచై నిలబడడం సామాన్య విషయం కాదు. పాఠశాలలో సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎదిగారు.
రాష్ట్ర ఆవిర్భావ చరిత్రలో జయశంకర్ పేరు అజరామరం. తెలంగాణ అంటే ఏమిటి? స్వరాష్ట్ర అవసరం ఎందుకు? ప్రజల ఆత్మగౌరవం, సమాన అభివృద్ధి, స్వయంపాలన ఎందుకవసరం? అనే ప్రశ్నలకు జీవితాంతం సమాధానంగా నిలిచి నడయాడిన మహనీయుడాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి, భాష యాస, చరిత్రలపై జరిగిన దాడిని వివరిస్తూ నీళ్లు, నిధులు, 610 జీవో, గిర్ గ్లానీ కమిటీ ల తీరును ఊరూరా ఎండగట్టారు.
1952 ముల్కీ ఉద్యమం, 1954 ఫజల్ అలీ కమిషన్, 1955 విలీనోద్యమం, 1969 చారిత్రక మహోద్యమం, 1996 వరంగల్ సభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం, 2009 మలిదశ ఉద్యమాలలో ఆయన పాత్ర ఘననీయమైనది. శ్రీకృష్ణ కమిటీ ముందు వాదనలు, దశదిశ కార్యక్రమాలు, కరపత్రాలు, ప్రెస్‌మీట్లు, సభలు, సదస్సులన్నీంటిలో ఆయన మాట్లాడిన మాటలు సబ్బండ వర్ణాలను కదిలించాయి. గడపగడపకు, గుండెగుండెకు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ, ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలహక్కని, రాజకీయ ఉద్యమాన్ని సామాజిక సాంస్కృతిక చైతన్య ఉద్యమంగా మార్చారు.
నాటి చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఉద్యమించిన ప్రజలపై జరిపిన కాల్పుల్లో రామకృష్ణ తదితర కార్యకర్తలు అమరులయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ విధానాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబంధకంగా మారడంతో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. రాజకీయ సాధనతోనే రాష్ట్రం సాధ్యమని జలదృశ్యంలో రాజీనామాలు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావంలో, చంద్రశేఖర్ రావు రాజకీయ ఉద్యమంలో నిలబడటానికి జయశంకర్ మేధో కృషి అపారమైనది. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదానికి ప్రాణం పోసింది ఆయనే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటింది. కానీ, జయశంకర్ కలలు పూర్తిగా సాకారమయ్యాయా? అనే ప్రశ్న ప్రతి తెలంగాణ బిడ్డని ఆలోచింపజేస్తుంది. రాష్ట్ర ఏర్పాటు ఒక లక్ష్యమైతే, పునర్నిర్మాణం ఆయన ఆశయం. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు నాణ్యమైన విద్య ఉపాధి, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయం ఆయన ఆలోచనలు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎవరి పాటామాట వారికయ్యాక, ఎవరి ఇల్లు వారికయ్యాక కూడా అస్తిత్వంపై విద్వేషపూరకమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నరు. ఇడుపు కాయితం లాంటి భాషపై అసహనాలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్కుల పేరున, విగ్రహాల చాటున తెలంగాణను కబళించాలని మరో మోసాలకు కంకణాలు కడ్తున్నరు.
జయశంకర్ సార్‌ను ఒక చారిత్రక వ్యక్తిగా మాత్రమే కాకుండా, శాశ్వత ఆదర్శంగా నిలపాల్సిన అవసరమెంతైనా ఉంది. అందుకోసం పాఠ్యపుస్తకాలలో ఆయన భావజాలానికి ప్రాధాన్యం కల్పించాలి. ప్రతి విద్యాసంస్థలో ఆయన పేరుతో చర్చా వేదికలు, పరిశోధనా కేంద్రాలు, ప్రజా విధానాలపై అధ్యయన కార్యక్రమాలు నిర్వహించాలి. యువత ఆయన రచనలు, ప్రసంగాలు, ఆలోచనలను అధ్యయనం చేసే వాతావరణం కల్పించాలి. జయశంకర్ చెప్పిన జ్ఞాన సూత్రాలు, ఆచరించిన విలువలను ప్రజా జీవితంలో అమలు చేయడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే.
అవినీతికి వ్యతిరేకంగా నిలబడడం, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన దార్శనికుడాయన. అందుకే ఆయనను ఉద్యమకారుడిగా మాత్రమే కాకుండా, ఆలోచించే మేధావిగా, విలువలతో కూడిన ప్రజా నాయకుడిగా గుర్తించాలి. ఆయన జీవిత పాఠం ఒక గొప్ప సందేశం ఇస్తుంది. వ్యక్తులు శాశ్వతం కాదు, కానీ వారు నాటిన విలువలు శాశ్వతం. తెలంగాణ సుభిక్షంగా వికసించాలంటే జయశంకర్ చూపిన దారిలో నడవాలి. ప్రజల ఆకాంక్షలే పాలనకు ప్రమాణంగా ఉండాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి.
తెలంగాణ సమస్యలను కేవలం భావోద్వేగాలపరంగా కాకుండా చారిత్రక, ఆర్థిక, సామాజిక, రాజ్యాంగపరమైన కోణాల్లో విశ్లేషించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. అరవై ఏళ్ల అన్యాయాలను గణాంకాలు, ఆధారాలతో దేశం ముందుంచి ఉద్యమానికి జయశంకర్ బలమైన మేధోపునాది వేసిన సంగతి విదితమే. ఉద్యమం అంటే కేవలం నినాదాలు కాదు, ప్రజల సమస్యలపై అవగాహన పెంచడం, చర్చలు నిర్వహించడం, యువతను చైతన్యవంతులను చేయడం, ప్రజాస్వామ్య పద్ధతులతో హక్కులను సాధించడం. ఆయన చూపిన ఈ మార్గాన్ని నేడు మనం అనుసరించాలి. ఆయన రాసిన ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ - సమస్యలు, పరిష్కారాలు’ వంటి పుస్తకాలు ఉద్యమకారులకు మార్గదర్శకంగా నిలిచాయి.
యువతలో సేవాభావాన్ని, బాధ్యతను, సమాజం కోసం పనిచేసే విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, రైతులు కలిసి ఉద్యమిస్తేనే శాశ్వత మార్పు సాధ్యమని ఆయన అభిలషించారు. ఉద్యమం వ్యక్తుల చుట్టూ కాకుండా ప్రజల ఆశయాల చుట్టూ సాగాలన్నదే ఆయన ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆయన ఆశయాలు సఫలం కాలేదు. ఆయన చూపిన మార్గం ప్రతి తరం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి స్ఫూర్తినిస్తుంది. నిన్నటి జంతర్ మంతర్‌లో వీరోచితంగా పోరాడి ధర్మేంద్ర ప్రదాన్‌ను రాజీనామా చేయించెంత వరకు వెనుతిరుగని విద్యార్థుల మహోద్యమం ఆ కోవలోనిదే.
వారు కాక్రోచ్‌లు కాదు, కర్తవ్య చిరుతలు. బొద్దింకలు కాదు, విప్లవ వేకువలు. కాక్రోచ్ ఉద్యమం పురుడుపోసుకొని ఢిల్లీ పురవీధుల్లో దావానలంలా వ్యాపించింది. పోలీసులు జరిపిన పాశవిక దాడితో నెత్తురుమడుగులైనా యుద్ధభూమిని మరిచిపోలే. దేశద్రోహులని ముద్దర్లేసినా, ఉగ్రవాదులని, పాకిస్థాన్ ఏజెంట్లని, చైనా అమెరికా హస్తాలని కట్టుకథల ప్రచారం చేసినా వెనక్కి తగ్గలే. జాతీయ మీడియా, యూట్యూబ్‌లు ఎంత నోళ్లు తెరిచినా ఎత్తిన పిడికిళ్లు దించలే. కేంద్ర నిరంకుశ వైఖరిని రోడ్డుకీడ్చి తీవ్రంగా నిరసించిన యువత జయశంకర్ ఆశయాలతో, స్ఫూర్తితో ముందుకుసాగి చివరి వరకు ఉద్యమించింది. ఆ ఉద్యమస్ఫూర్తితో నేడు మనం కూడా తెలంగాణ సమస్యలపై పోరాడాలి.
ఆచార్య జయశంకర్ ఉద్యమకారుడు మాత్రమే కాదు, ఆయన ఒక సిద్ధాంతకర్త, గొప్ప విద్యావేత్త, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగం, చూపిన దారి, అందించిన స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో, నిబద్ధతతో పోరాడాలనే సందేశమే ఆయన మనకు అందించిన గొప్ప వారసత్వం.
వ్యాసకర్త సెల్: 9492765358
-వనపట్ల సుబ్బయ్య






