6 August, 2026 | 2:32 AM

కాషాయ కంచుకోటలో పీకే పాగా

06-08-2026 12:00 AM

దేశ రాజకీయాల్లో మార్పు అనివార్యమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. ఒకప్పుడు అప్రతిహతంగా కనిపించిన రాజకీయ శక్తులు ప్రజల తీర్పు ముందు తలవంచిన సందర్భాలు అనేకం. బిహార్ రాజధాని పాట్నా సాహెబ్ లోక్‌సభ పరిధిలో ఒక నియోజకవర్గమైన బంకీపూర్ ఫలితం పెనుమార్పులకు సంకేతంగా నిలిచింది.

ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీక్ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు రగిల్చిన ఆందోళన చల్లారక ముందే, దాని ప్రకంపనలు సమసిపోకముందే ఎన్నికలు రావడంతో పరిస్థితులు బీజేపీకి, మోదీకి ప్రతికూలంగా మారిపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే బంకీపూర్ ఉప ఎన్నిక జూలై 30న కాగా, జూలై 27న బిహార్ హోం శాఖ విద్యార్థులపై అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటూ అత్యవసర ఆదేశాలు జారీచేసింది. అయినా ఫలితం లేకపోయింది. 

ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ వరుస ఎన్నికల్లో విజయాలను సాధించినప్పటికీ, పన్నెండు సంవత్సరాలకు పైగా అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వంపై నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, సామాజిక ఉద్రిక్తతలు వంటి అంశాలపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజల అంచనాలు కూడా కాలక్రమేణా మారుతాయి. నినాదాల కంటే పాలన ఫలితాలనే ఓటర్లు ఎక్కువగా పరిశీలించే దశకు దేశ రాజకీయాలు చేరుతున్నాయనే అభిప్రాయానికి ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం. ఈ ప్రతిధ్వని బంకీపూర్ ఎన్నికల ఫలితాలను నిర్ణయించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మార్పు ప్రతిపక్ష శక్తుల మధ్య సమన్వయానికి దోహదపడుతుందనే భావన విశ్లేషకులకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవడం సాధారణ పరిణామం కాదు. ఎన్నికల గణాంకాలనే కాదు, ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. బిహార్‌లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయోగం, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే అం చనాలకు అన్ని పార్టీలు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట అనే భావన రుజువు అయ్యింది. 

మరోవైపు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గత కొన్నేళ్లుగా చేపట్టిన పాదయాత్రలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, కులగణన, ఉపాధి, రైతుల సమస్యలపై ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు ప్రతిపక్ష రాజకీయాలకు కొత్త ఊపు తెచ్చాయని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. పాట్నా యూనివర్సిటీ లో 1974 మార్చిలో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో జరిగిన నిరసనను మించి కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన పాట్నా విధుల్లోకి చేరింది.

ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో ఏదో సాధిద్దామని కలలు కంటే, నిత్యం జంతర్ మంతర్ నిరసనలు, విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు, నీటి క్యానన్లను ప్రయోగించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. రాహుల్ ధాటిని తట్టుకునే పరిస్థితి సభలో కన్పించడం లేదు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ కోటా ప్రస్తావన తెచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఏమైనా చిన్నాచితక బిల్లులు తప్ప, కీలక బిల్లులను ప్రవేశ పెట్టలేకపోతున్న ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

పీకే వ్యూహం, రాహుల్ రాజకీయ ప్రచా రం ఒకే దిశలో సాగితే దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం, ప్రాంతీయ పార్టీలతో అవగాహన పెరగడం వంటి అంశాలు బీజేపీకి సవాలుగా మారవచ్చని వారు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించేది వ్యూహాలు మాత్రమే కాదు. ప్రజల విశ్వాసం, స్థానిక నాయకత్వం, బలమైన సంస్థాగత వ్యవస్థ, ఎన్నికల సమయంలో ఏర్పడే రాజకీయ పరిస్థితులు కూడా సమానంగా ప్రభా వం చూపుతాయి. బీజేపీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా బలమైన రాజకీయ శక్తిగానే కొనసాగుతోంది.

అయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల ఎదుగుదల ఎల్లప్పుడూ స్వాగతించదగినదే. అధికారాన్ని ప్రశ్నించే శక్తి ఎంత బలంగా ఉంటే, ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. ఈ కోణం లో చూస్తే, ప్రశాంత్ కిశోర్ గెలుపు, రాహుల్‌గాంధీ చేపడుతున్న పోరు దేశ రాజకీయ చర్చను కొత్త దిశగా తీసుకెళ్తున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. కాషాయ కంచుకోటలో పీకే పాగా వేయడం మోదీ నాయకత్వానికి నిజంగా రాజకీయ సవాలుగా మారుతుందా? అనే ప్రశ్నకు సమాధానం రానున్న ఎన్నికలే చెప్పనున్నాయి. కానీ మార్పు కోసం ఎదురుచూస్తున్న ఓటర్లలో కొత్త చర్చకు ఈ పరిణామాలు దారితీస్తున్నాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే రాహుల్ ప్రజల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత మూడు దశాబ్దాలుగా కాషాయ కంచుకోటగా ఉన్న పాట్నా లోక్‌సభ నియోజకవర్గంలోని బంకీపూర్‌లో తొమ్మిది నెలల కింద జరిగిన ఎన్నికల్లో 52 వేల మెజార్టీతో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ గెలిచారు. ఆయన అక్కడి నుంచి అయిదుసార్లు విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో అక్కడ అవలీల గా బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు భావించారు.

కానీ, ఎవరూ నిలబడినా తమ కు తిరుగులేదని అహంకారంతో ఉన్న బీజేపీ ఓటమి పాలై, ఇప్పటికే అనేక ఎన్నికల్లో ఓటమిపాలై నిరాశతో ఉన్న విపక్షాలకు ఊపిరిపోసింది. అయోధ్య ముడుపుల చోరీ, పేపర్ లీకేజీ, కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఇవ్వకపోవడం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉత్తర కుమారుని మాటలుగా మిగిలి, బీజేపీ ఓటు శాతం ఒక్క ఏడాదిలో నే 63 శాతం నుంచి 34.4 శాతానికి పతనమైంది. బిహార్ చరిత్రలో మొదటిసారిగా అధికారం చేపట్టిన బీజేపీకి చేదు అనుభవం ఎదుదైంది. 2024లో స్థాపించిన జన్ సురాజ్ పార్టీ గత ఎన్నికల్లో రాణించకపోయినా, వ్యూహకర్త ‘పీకే’ జై బీహార్ నినాదం ముందు బీజేపీ ఈసారి వెలవెలబోయింది.

జెన్ జీ చేపట్టిన ధర్నా ప్రశాంత్ కిషోర్‌కి వెన్నుదన్నుగా నిలిచింది. బంకీపూర్ ఓటర్లలో వచ్చిన ఓబీసీల చైతన్యం ముందు కుల సమీకరణాలపైనే ఆధారపడే రాజకీయ నాయకులకు ఈ ఫలితాలు కళ్లు తెరిపించాయనే చెప్పాలి. ఇప్పుడు భారత రాజకీయాల్లో కూడా ఇలాంటి మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీకి బలమైన కంచుకోటగా భావించే ప్రాంతాల్లోనే ప్రత్యామ్నాయ రాజకీయాల ఫలితం అందుకు ఉదాహరణగా భావించాలి. ప్రతిపక్షాలకు అనుకూలమైన ఈ సమయం ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ, ఇదే సమయంలో వచ్చిన బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలోని మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో రాబోయే మార్పును సూచిస్తున్నాయని విశ్లేషకులు  చెబుతున్నారు.

వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, 9866255355

ప్రొ. సంగని మల్లేశ్వర్