బలిపశువుగా జేడీ వాన్స్?
ఇరాన్‌తో చర్చల వైఫల్యానికి బాధ్యుడేనా?
వాషింగ్‌టన్, జూన్ 22: ఇరాన్‌తో జరిగే శాంతి చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బలి పశువుగా మారనున్నాడా..? అవుననే సమాధానం వైట్‌హౌస్ వర్గాల నుంచి వినవస్తున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమై తే ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్ప దు. జేడీ వాన్స్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే బాధ్యత ఆయనపై పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఇప్పటికే రెండుసార్లు దీనిపై సంకేతాలు ఇచ్చారు.
వైఫల్యానికి తన డిప్యూటీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ చేతిలో అమెరికాకు ఎదురవుతున్న అవమానానికి వాన్స్‌ను ట్రం ప్ ముఖచిత్రంగా మార్చారు. ఇరాన్‌తో చర్చ లు అనుకున్నట్లు సాగడం లేదు. దీంతో వాన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జెనీవాలో జరిగిన చర్చల్లో ఈ విష యం స్పష్టమైంది. ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాకర్ కాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఫొటోల కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వాకౌట్ చేశారు. వాషింగ్టన్ నుంచి ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలపై వారు మండిపడ్డారు.
అమెరికా ప్రతినిధులను సైతం అవమానించారు. దీంతో ఇవన్నీ వాన్స్ నేరుగా భరించాల్సి వచ్చింది. ప్రజల నుంచి వస్తున్న విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 14 అంశాల శాంతి ఒప్పందంపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీలోని రక్షణ నిపుణులు దీనిని తప్పుబడుతున్నారు. ఇరాన్‌పై చమురు ఆంక్షల ఎత్తివేత, నిలిచిపోయిన నిధుల విడుదల వంటి నిర్ణయాలను వారు అమెరికా లొంగుబాటుగా భావిస్తున్నారు.
మధ్యప్రాచ్య వ్యవహారాల్లో జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాన్స్ ఇప్పుడు ఈ ఒప్పందానికి ప్రధాన మద్దతుదారుగా నిలవడం గమనార్హం. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ వంటి కఠిన వైఖరి గల నాయకులు ఈ చర్చల నుంచి వ్యూహాత్మకంగా తప్పుకున్నారు. దీంతో వాన్స్ ఒంటరి అయిపోయారు. వాన్స్ రాజకీయ భవిష్యత్తుకు ఇది అత్యంత కీలకమైన సమయం. ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి ఆయనే ప్రధాన నాయకుడిగా మారారు.
ఒకవేళ ఇరాన్‌తో విజయవంతంగా ఒప్పందం కుదిరితే ఆయన రాజకీయ కెరీర్ అద్భుతంగా ఎదుగుతుంది.రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఆయన బలం పెరుగుతుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం ట్రంప్ ఆ నిందనంతా వాన్స్ పైనే నెట్టేస్తారు. ట్రంప్ కావాలనే వెలుగులోకి రాకుండా వాన్స్ ముందుకు నెట్టారని వైట్‌హౌస్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్ తన డిప్యూటీని బలిపశువును చేశారని కొందరు విశ్లేషిస్తున్నారు.






