ముంబైని తాకిన రుతుపవనాలు
కురవనున్న వర్షాలు
ముంబై, జూన్ 22: ఎట్టకేలకు నైరుతి రుతు పవనాలు ముంబై నగరంలోకి ప్రవేశించాయి. జూన్ మధ్యలో కాస్త నెమ్మదించినప్పటికీ, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా మారి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న గాలులు ముంబై, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో రుతుపవనాలను మళ్లీ చురుగ్గా మార్చాయి. గత రెండు వారాలుగా రుతుపవనాల గమనం పూర్తిగా నిలిచిపోయింది.
దీంతో దేశవ్యాప్తం గా జూన్ నెలలో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి. లోతైన రుతుపవన తేమ ముంబై, పరిసర ప్రాంతాలకు చేరుతోంది. తేమతో కూడిన గాలులు సూరత్ సహా దక్షిణ గుజరాత్ వైపు విస్తరిస్తున్నాయి. వాతావరణ పటాల ప్రకారం అరేబి యా సముద్రపు రుతుపవన శాఖ మళ్లీ పుంజుకుంటోంది. వాతావరణంలో తేమ రవాణా బలోపేతం అవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
రాబోయే 24 నుంచి 48 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్, మధ్య భారత ప్రాంతాలలో వర్షాలు క్రమంగా పెరుగుతాయి. రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నప్పటికీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాగాగత 146 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత అత్యంత పొడి వాతావరణం ఈ జూన్లో నమోదైంది. ఈ ఆలస్యం వల్ల దేశంలో సాగు పనులు నిలిచిపోయాయి. నీటి కొరత ముప్పు కూడా పెరిగింది. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైనప్పటికీ బలహీనమైన రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
వాతావరణ నిపుణుల లెక్కల ప్రకారం 2026 జూన్ నెల శతాబ్ద కాలంలోనే అత్యంత ఎండిపోయిన మాసంగా నిలిచింది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ 4 నుంచి జూన్ 22 వరకు దేశంలో కేవలం 53.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.సాధారణంగా ఈ సమయంలో 97.6 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. దీనివల్ల దేశంలో 46 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. మధ్య, ఉత్తర, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక పరిస్థితి దారుణంగా మారింది.
రాష్ట్రాల వారీగా చూస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశ రుతుపవన కోర్ జోన్‌లో ఉన్న మధ్యప్రదేశ్‌లో 58 శాతం లోటు కనిపిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 85 శాతం వర్షపాత లోటు నమోదైంది. గుజరాత్‌లో సాధారణం కంటే 84 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి.గత శతాబ్ద కాలంలో నమోదైన పరిశీలనల ప్రకారం ఈ జూన్ అత్యంత పొడి కాలంగా నిలిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వర్షపాత లోటు తీవ్రమైన కరువు సంవత్సరాల స్థాయికి చేరుకుంది.






