calender_icon.png 26 August, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

14-03-2025 12:28:33 AM

ఆదివాసి మహిళా నేతల డిమాండ్

భద్రాచలం,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో యువత అగ్రభాగంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటికీ, ప్రభుత్వం వారి భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోందని ఆదివాసి సంక్షేమ పరిషత్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కుంజా రమాదేవి, మహాజన సమితి ఆదివాసి మహిళా రాష్ట్ర కన్వీనర్ కంగాల రమణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం కేంద్రంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి సాగినా, ప్రస్తుత ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. చదువు అనంతరం యువతకు ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కానీ ప్రస్తుతం వారిని నిరుద్యోగంతో అవస్థలు పడేలా చేస్తున్నారన్నారు.

తెలంగాణలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరుకుందని, యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందన్నారు. ప్రభుత్వాల అనాలోచిత విధానాలు ప్రజలపై భారం పెంచుతున్నాయని, రాష్ట్రానికి అవసరంలేని పథకాలు ప్రవేశపెట్టి అసలైన సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, మెడికల్ మాఫియా, నిషేధిత మత్తు పదార్థాల మాఫియా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు చేశారు. బడా పెట్టుబడిదారులకు తెలంగాణ పగ్గాలు అప్పగించడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని, సామాజిక అంశాల్లో క్రమంగా దుష్ప్రభావం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి తెలంగాణ ఆకాంక్షను నిలబెట్టాలని వారు డిమాండ్ చేశారు.