6 August, 2026 | 1:41 AM

గెస్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

23-08-2024 01:59 PM

సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు రెన్యువల్ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని అతిథి అధ్యాపక సంఘం (2152) జిల్లా అధ్యక్షుడు ముడిమడుగుల మారుతి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొమరం భీం చౌక్ నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2012 నుండి ప్రభుత్వ కళాశాలల్లో అతిధి ఆధ్యాపకులుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ప్రతి సంవత్సరం రెన్యువల్ ఉత్తర్వుల కోసం ఎదురుచూసి సంవత్సరంలో 8 నెలలు మాత్రమే వేతనం తీసుకుంటూ అకాడమిక్ సంవత్సరం మొత్తం పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రస్తుతం రెగ్యులర్ అధ్యాపక నియామకంతో తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. రెగ్యులర్ నియామకాల తో సంబంధం లేకుండా తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 42 వేలు వేతనాలు చేసి, 12 నెలలు అందించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కృష్ణమూర్తి, రాము, యాదగిరి, భిక్షపతి, రాంబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు.