06-10-2025 02:00:01 PM
చిట్యాల,(విజయక్రాంతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65(National Highway) పై చిట్యాల నుండి పెద్దకాపర్తి వరకు సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా సెలవులను ముగించుకొని నగర బాట పట్టిన ప్రయాణికులు ఆదివారం నుండే వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడం ఒక కారణం కాగా, హైవే పై లారీ పంక్చర్ మరో కారణంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ ఏర్పడగా నెమ్మదిగా ముందుకెళ్తున్న వాహనాలతో ప్రయాణికులు గంటల తరబడి రద్దీలో ఇరుక్కుంటున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు రద్దీ లేకుండా ఉండడం వలన వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ జామ్ ను నియంత్రించడానికి తగు చర్యలను చేపడుతున్న ఫలితం లేకుండా పోతుంది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.