మైహోమ్ అవతార్ జంక్షన్ అండర్ పాస్ పరిశీలించిన జాయింట్ సీపీ
ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడాలని పోలీసులకు ఆదేశం
శేరిలింగంపల్లి,జూలై 13 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద నిర్మాణం జరుగుతున్న ఫ్రీ లెఫ్ట్ టర్న్ అండర్పాస్ ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్,(ఐపీఎస్) సోమవారం పరిశీలించారు.నిర్మాణ స్థలంలో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించిన ఆయన పనుల పురోగతిని సమీక్షించారు.పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సాఫీగా,అంతరాయం లేకుండా నడిచేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయడానికి ముందు తప్పనిసరిగా ట్రయల్ రన్ నిర్వహించి,లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అవసరమైన ప్రాంతాల్లో బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, దిశా సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ పోలీసులు, నిర్మాణ సంస్థలు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.ఈ పర్యటనలో డీసీపీ ట్రాఫిక్-I ఎస్.రవికుమార్,అదనపు డీసీపీ ట్రాఫిక్-I టి.హనుమత్ రావు,ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.






