9 March, 2026 | 10:49 PM

జోష్ కొనసాగించాలి

09-03-2026 02:29 AM
  1. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి 
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  3. మాజీమంత్రి మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నీ ప్రారంభం 
  4. వార్షికోత్సవానికి మల్పనగా నామకరణం చేసిన కేటీఆర్

మేడ్చల్, మార్చి 8 (విజయక్రాంతి): కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవరకు యువకులు జోష్ కొనసాగించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. ఆదివారం మేడ్చల్ జిల్లా కీసర మండలపరిధిలోని రాంపూర్ దయారా క్రికె ట్ గ్రౌండ్‌లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న సీఎంఆర్ కప్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువకుల్లో మంచి జోష్ ఉందన్నారు.

ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో మూడింటిలో రెండు మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాలు గెలుపొందడం అభినందనీయం అన్నారు. మల్లారెడ్డి, కల్పన దంపతుల వివాహ వార్షికోత్సవానికి కేటీఆర్ ‘మల్పన’గా నామకరణం చేశారు. మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఆరు రోజులపాటు నిర్వహించ డం అభినందనీయమన్నారు. 14వ తేదీన సంగీత్ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతానని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కౌన్సిలర్లను కేటీఆర్ సన్మానించారు. కేటీఆర్ వస్తున్న సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో చామకూర మహేందర్‌రెడ్డి, డాక్టర్ చామకూర భద్రరెడ్డి పాల్గొన్నారు.

మల్లారెడ్డి బౌలింగ్.. కేటీఆర్ బ్యాటింగ్

సీఎంఆర్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం సందర్భంగా మల్లారెడ్డి బౌలింగ్ చేయగా, కేటీఆర్ బ్యాటింగ్ చేశారు. వీరు క్రికెట్ ఆడుతున్న సందర్భంగా యువకులు ఈలలతో ఉత్సాహపరిచారు. టోర్నీలో మొత్తం 84 జట్లు పాల్గొంటున్నాయి. విజేతకు లక్ష రూపాయలు, రన్నర్‌కు రూ.50 వేల ప్రైజ్ మనీ అందించనున్నారు.