21-11-2025 06:22:46 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్, కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రం సతీష్ కుమార్, గుజ్జ సారేశ్వరరావులు మాట్లాడుతూ... తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలికంగా పనిచేస్తుందన్నారు.
జీవో 239 ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ ఫెడరేషన్ వేలాది మంది సభ్యత్వం కలిగి సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట రవాణా సౌకర్యం తదితర సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ వినతిపత్రాలు, దరఖాస్తులు ఇస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ల దృష్టికి తెస్తుందన్నారు.అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉన్నారనీ, ఇందులో కేవలం 274 మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయన్నారు.
అక్రిడిటేషన్లు గత ఏడాదిన్నర కాలంగా స్టిక్కర్లతో నడుస్తున్నాయని, పర్మినెంట్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో విధుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గతంలో 37 మందికి ఇంటి స్థలాల పట్టాలి ఇచ్చారని, కావున వీరితోపాటు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.
రేగొండ మండల కేంద్రానికి చెందిన 12 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారని, వీరికి కూడా స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అదే విధంగా టేకుమట్ల మండలంలోని జర్నలిస్టులకు సైతం పట్టాలు ఇచ్చారు కానీ స్థలం కేటాయింపులో జాప్యం జరుగుతుందన్నారు.అంతేకాకుండా జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు రాయితీ కల్పించడం లేదనీ, కావున అట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.కావున పై సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.