21-11-2025 06:11:42 PM
మండల స్థాయిలో చెకుముకి సైన్స్ సంబరాలు 2025
చిట్యాల,(విజయక్రాంతి): జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో చెకుముకి సైన్స్ సంబురాలు 2025 సందర్భంగా శుక్రవారం మండల స్థాయిలో హైస్కూల్ విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జడ్పీహెచ్ఎస్ చిట్యాలలో నిర్వహించారు. మండలంలో 10 ప్రభుత్వ పాఠశాలల, 6 ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ మండలస్థాయిలో విజేతలకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు బహుకరించి మాట్లాడుతూ ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్ అనే ఆశయాలతో జన విజ్ఞాన వేదిక ఏర్పడి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పధాన్ని విద్యార్థులలో పెంపొందిస్తూ బాలబాలికల విద్యా, విజ్ఞానం, వికాసం కోసం పాఠశాల స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు చెకుముకి సైన్స్ సంబరాలు అనే పేరుతో ఒక పెద్ద సైన్స్ పండుగగా నిర్వహించటం అభినందనీయమని,
విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి పరిశోధనాత్మక దృష్టితో ప్రతి విషయాన్ని పరిశీలించి శాస్త్రీయ ఆలోచనతో ప్రయోగాత్మకంగా కొత్త పరిశోధనలు చేయాలని దానితోనే దేశ ప్రగతి సాధ్యమైతుందని, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించాలంటే సైన్స్ విజ్ఞానం ద్వారానే సాధ్యమవుతుందని, విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి సైన్సులో ప్రావీణ్యతను పెంచటానికి సృజనాత్మక శక్తినివెలికితీయటానికి శాస్త్రీయ ఆలోచనలు పరిశీలనాస్తక్తిని రేకేత్తించడానికి సైన్స్ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడే విధంగా రూపొందించిన సైన్స్ సంబరాలు జరగడం శుభపరిణామమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి. సుశీల మాట్లాడుతూ జె.వి.వి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ లు గత 36 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ప్రతి సంవత్సరము ఐదు, ఆరు లక్షల మంది విద్యార్థులు సైన్స్ సంబురాలలో పాల్గొనటం చాలా గొప్ప విషయమని అన్నారు. జెవివి కోఆర్డినేటర్ కుకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ చిట్యాల మండల స్థాయిలో నిర్వహించిన పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విభాగము నుండి జడ్.పి.హెచ్.ఎస్ నేరడ టీం, ప్రైవేట్ పాఠశాలల విభాగము నుండి కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ టీం ప్రథమ బహుమతి పొంది జిల్లా స్థాయికి ఎంపికైందని, జిల్లాస్థాయిలో నవంబర్ 28న పరీక్ష ఉంటుందని జిల్లా స్థాయిలో ఎంపికైన టీం డిసెంబర్ 2025 రాష్ట్రస్థాయి సంబరాలలో పాల్గొంటుందని విద్యార్థులకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి సైన్స్ ప్రయోగాలు సైన్స్ అద్భుత ప్రదర్శనలు సైన్స్ పుస్తక ప్రదర్శన సైన్స్ జాతర మొదలగు కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కమిటీ కన్వీనర్ రంగా రామలింగయ్య, ఉరుమడ్ల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భోదనం వెంకట్ రెడ్డి, జి.అలెగ్జాండర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి, ఏశమల్ల నాగయ్య, గోవర్ధన్, పి చంద్రయ్య, శంకరయ్య, బి. లింగయ్య, కిరణ్ పాల్గొన్నారు.మండల స్థాయి విజేతలు ప్రభుత్వ పాఠశాలల విభాగం నుండి ప్రధమ బహుమతి జడ్పిహెచ్ఎస్ నేరడ, ద్వితీయ బహుమతి జడ్పిహెచ్ఎస్ గుండ్రాoపల్లి, తృతీయ బహుమతి జెడ్పిహెచ్ఏ చిన్నకాపర్తి పొందారు. ప్రైవేట్ పాఠశాలల విభాగము నుండిప్రధమ బహుమతి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ , ద్వితీయ బహుమతి ఠాగూర్ హై స్కూల్, తృతీయ బహుమతి లయోలా టెక్నో స్కూల్ పొందారు.