జ్యుడీషియల్ కమిషన్
జిల్లాల పునర్విభజనకు విశ్రాంత జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు
- ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా
- ఉద్యోగులు పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరిస్తాం
- రాచకొండ పేరు రాచరిక పాలనకు గుర్తుగా ఉందనే మార్చాం
- సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీలో భాగంగానే ఉంది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
- గెజిటెడ్ ఉద్యోగుల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 12(విజయక్రాంతి) : జిల్లాల పునర్విభజన కోసం త్వరలోనే విశ్రాంత జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తుందన్నారు. గతంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ఆశాస్త్రీయంగా, అడ్డగోలుగా జరిగిందని, జిల్లాల సరిహద్దులు మార్చాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే జిల్లాల పునర్విభజన చేయనున్నట్లు చెప్పారు. సంక్రాంతి కానుకగా ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులకు తెలిపారు.
దీంతో ప్రభుత్వానికి రూ. 227 కోట్ల భారం పడుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ. 1.02 కోట్ల ప్రమా బీమా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు, త్వరలోనే అమలుచేస్తామని చెప్పారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ క్యాలెండర్, డైరీని సోమవారం సచివాయలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన జిల్లాల సమస్యలను సరిదిద్దుతామని, తద్వారా పాలన వ్యవస్థను మరింత సమర్ధవంతం చేయడానికి అవసరమన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందన్నారు. జిల్లాల పునర్విభజన కమిషన్ ఆరు నెలల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్‌పై నివేదిక సమర్పిస్తుందన్నారు.
అన్ని జిల్లాలు, మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదని, అందుకే మార్చినట్లు సీఎం చెప్పారు. రాచకొండ పేరు రాచరిక పాలనకు గుర్తుగా ఉం దని మార్చామన్నారు. సికింద్రాబాద్ విషయంలో తాను వచ్చాక చేసిందేమి లేదని, సికింద్రాబాద్ గతంలోనే జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.
నేను ఒక్క రోజు సెలవు తీసుకోలేదు..
సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, రాష్ట్రాభివృద్ధ్ది కోసం రోజు 18 గంటల పనిచేస్తున్నా సమయం సరిపోవడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రోజుకు 12 గంటలే కష్టపడినట్లు చెప్పారు. ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్‌లో ఉండి .. అసెంబ్లీలో మారీచులను ఆడిస్తున్నాడాని సీఎం ఎద్దేవా చేశారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు పట్టించుకోవద్దని, కడుపులో విషం పెట్టుకుని కొందరు మాట్లాడుతున్నారని సీఎం దుయ్యబట్టారు.
ఒకాయన ఫాంహౌస్‌లో ఉంటే.. మరో ఇద్దరు అసెంబ్లీలో ఆరోపణలు చేస్తున్నారని, వాళ్ల మాటలు పట్టించుకోవద్దని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగులను రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, మెడికల్ బిల్స్ చెల్లించలేదని, తమ ప్రభుత్వం రాగానే వీటిపై శ్వేతపత్రం విడుదల చేశామని సీఎం గుర్తు చేశారు. గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం కార్యాలయం నిర్మాణానికి సహకరిస్తామన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందిద్దామని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని హామీ ఇచ్చారు.
సారథులు, వారధులు మీరే..
ఉద్యోగులే తమ సారథులు, వారధులు అని, అందుకు ఉద్యోగుల సమ స్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నెలకు రూ. 18 వేల కోట్లని, కానీ ప్రతి నెల రూ. 22 వేల కోట్ల అప్పులు చెల్లించాల్సి వస్తుందన్నారు. సగటు మధ్యతరగతి వ్యక్తి కుటుంబాన్ని గౌరవంగా ఎలా ముందుకు తీసుకెళ్లుతు న్నారో.. ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి అన్నారు. గత ప్రభుత్వం ఉ ద్యోగులపై ఒత్తిడి చేయించి తప్పుడు పనులు చేయిందని సీఎం ఆరోపించారు. గత ప్రభత్వం వదిలివెళ్లిన అప్పులను తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రభుత్వాన్ని నడిపేది ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, రాష్ట్రాన్ని నడిపేది 10.50 లక్షల మంది ఉద్యోగలని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగులు సరిగా పని చేయడం వల్లే పథకాలు సరిగా అమలవుతాయని, అభివృద్ది, సంక్షేమం ప్రజలకు చేరుతాయన్నారు. ఉద్యోగులు బకాయిలు రూ. 12 వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భూములు, ఇసుక, పన్ను వసూళ్లలో అవకతవకలు అరికిడితే కావాల్సిన నిధులు అవే వస్తాయన్నారు. ఇప్పుడు పన్నులు పెంచాల్సిన అవసరం లేదని, పన్నులు సరిగా పనిచేస్తే చాలన్నారు. చాలమందిని పన్ను కట్టాలని ఉద్యోగులు అడగటం లేదన్నారు.






