మైనింగ్ మాఫియాపై హైడ్రా మెగా ఆపరేషన్
ఒకే రోజు 18 అక్రమ యూనిట్ల కూల్చివేత!
శంషాబాద్, మే 5(విజయక్రాంతి): అక్రమ మైనింగ్ మరియు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పారిశ్రామిక యూనిట్లపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. శంషాబాద్, గండిపేట పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే విరుచుకుపడ్డ అధికారులు, భారీ యంత్రాలతో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.6 స్టోన్ క్రషర్లు, 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లు. వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, కొత్వాల్‌గూడ సహా మొత్తం ఆరు ప్రాంతాలు.అనుమతులు లేకపోవడం, తీవ్ర కాలుష్యం, విద్యుత్ చౌర్యం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం తో రంగంలోకి సంయుక్త బృందాలు దిగాయి. పీసీబీ (PCB), మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ మెగా ఆపరేషన్ చేపట్టింది. సుమారు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి మైనింగ్ మాఫియాకు గట్టి హెచ్చరికలు పంపారు.
బయటపడ్డ బడా సంస్థల దందాలు
ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గ్రేట్ ఇండియా మైనింగ్ (గౌలిదొడ్డి), పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్ (వట్టినాగులపల్లి) వంటి సంస్థలు ఎటువంటి అనుమతులు లేకుండానే ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు బకాయి ఉండటంతో కనెక్షన్ కట్ చేసినప్పటికీ, దొంగచాటుగా భారీ డీజిల్ జనరేటర్లను ఉపయోగిస్తూ యంత్రాలను నడుపుతున్నట్లు అధికారులు కనుగొన్నారు.
పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి నివాస ప్రాంతాల వద్దే పేలుళ్లు జరుపుతూ ప్రజల ప్రాణాలతోచెలగాటమాడుతున్నట్లు తేలింది.ఊపిరి పీల్చుకున్న స్థానికులునిరంతరాయంగా వెలువడే దుమ్ము, ధూళి మరియు రాళ్ల పేలుళ్ల శబ్దాలతో నరకం అనుభవిస్తున్న స్థానిక గ్రామాల ప్రజలు హైడ్రా చర్య పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. "మా ఊర్లలో కనీసం ఊపిరి పీల్చుకోలేకపోయేవాళ్లం, హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం మాకు ఎంతో ఊరటనిచ్చింది" అని వట్టినాగులపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
అధికారుల హెచ్చరిక
"ప్రభుత్వ భూములను ఆక్రమించినా, పర్యావరణానికి హాని కలిగించేలా అక్రమ మైనింగ్ చేపట్టినా ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తాం అని అధికారులు పేర్కొన్నారు.






