01-09-2025 02:33:11 AM
కీలక నిర్ణయం తీసుకున్నాం.. ఎవరినీ వదిలిపెట్టం
-ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను సభలో పెట్టాం
-మీరు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి
-చర్యలెలా తీసుకోవాలో మాకు తెలుసు
-అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటాం..
-చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్ సభ్యుల ప్రయత్నం
-అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చించామని,ఈ అంశంపై సమగ్ర విచా రణ చేపట్టేందుకు సీబీఐకి అప్పగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ఆదివారం కాళేశ్వరం ప్రాజె క్టు కుంగుబాటుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు వాడీవేడిగా చర్చ జరిగింది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా కమిషన్ నివేదికపై మాట్లాడారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో నాటి సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడంలో కుట్ర దాగి ఉందన్నారు.
కాకతీయులు, నిజాం సర్కార్‌తో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన నిర్మాణాలు పదిలంగా ఉంటే కాళేశ్వరం ఎందుకు కూలిందో చెప్పాలని సీఎం నిలదీశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేది కను మీ ముందుంచాం. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. మీరు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి.. ఇవ్వకున్నా ఎవరినీ వదిలిపెట్టం.. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటాం. చర్యలు ఎలా తీసుకోవాలో మాకు తెలుసు.
సరైన సమయంలో సరైన చర్యలుంటాయి’ అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతి విషయాన్ని నివేదికలో ప్రస్తావించామన్నారు. ‘ఎంఐఎంఎల్పీ నేత అక్బర్ నా మిత్రుడు జోకులు వేసినా సరదాగా తీసుకుంటా.. కానీ, సర్కారుపై మాత్రం జోకులు వేయవద్దని అక్బర్‌ను కోరుతున్నా’ అని సీఎం చురకలు అంటించారు. కాళేశ్వరంపై దర్యాప్తు సంస్థల నివేదికలన్నీ జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ఇచ్చామని, ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలా..? లేదా అనేది కమిషన్ ఇష్టమన్నారు.
ఘోష్ కమిషన్‌ను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. రూ. లక్ష కోట్లు వృథా అయ్యాయనే బాధ ఉందని, అందుకే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లపై విచారణ చేపట్టామన్నారు. జస్టిస్ పీసీ ఘోష్‌కు ఎంతో అనుభవం ఉందని, అనేక తీర్పులు ఇచ్చారని, అన్ని ఆలోచించే జస్టిస్ పీసీ ఘోష్ ఏకసభ్య కమిషన్ వేశామన్నారు. కమిషన్ నివేదికను అక్బర్ పూర్తిగా చదవాలని కోరుతున్నానని, నివేదిక పూర్తిగా చదవకుండా తమపై లేనిపోని ఆరోపణలు చేయవద్దన్నారు. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ , కాగ్ నివేదికలను జస్టిస్ ఘోష్‌కు ఇచ్చామని, వాస్తవాలు వక్రీకరించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ కొనుగోళ్లపైన కేసీఆర్, హరీశ్‌రావు కోర్టుకు వెళ్లారు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్‌కు వ్యతిరేకంగా 8 బీ కింద నోటీసు ఇవ్వలేదంటూ కేసీఆర్, హరీశ్‌రావు కోర్టుకు వెళ్లారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. విద్యుత్ కొనుగోళ్లపై వేసిన నర్సింహారెడ్డి కమిషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని తెలిపారు. 8బీ కింద నర్సింహారెడ్డి నోటీసు ఇస్తే కేసీఆర్, హరీశ్‌రావు తప్పుబట్టారని అన్నారు. వీటన్నింటిని పీసీ ఘోష్ కమిషన్ మెన్షన్ చేసిందన్నారు. సభ్యుడు ఎవరైనా ఏవైనా సూచనలు చేస్తే సూటిగా, స్పష్టంగా చెప్పాలన్నారు. గంటన్నర మాట్లాడినా తాను సైలెంట్‌గా ఉన్నానని, కానీ సభను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.