calender_icon.png 1 September, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో గందరగోళం

01-09-2025 02:31:57 AM

  1. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతుండగా పోడియాన్ని ముట్టడించిన బీఆర్‌ఎస్
  2. పీసీఘోష్ నివేదిక ప్రతులు చించి నిరసన
  3. అనంతరం బయటకు వచ్చి గన్‌పార్కు వద్ద నిరసన 
  4. సభలో మా గొంతు నొక్కారు
  5. పీసీఘోష్ నివేదిక చెత్త నివేదిక 
  6. గన్ పార్క్ వద్ద కేటీఆర్  

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): అసెంబ్లీలో ఆదివారం గందరగోళం నెలకొంది. సభలో  కాళేశ్వరం కమిషన్ నివేదికపై వాడీవేడిగా చర్చ జరుగుతుండగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్యే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగాన్ని కొనసాగించారు.

అటు కాంగ్రెస్ సభ్యులు, ఇటు బీఆర్‌ఎస్ సభ్యులు రెచ్చిపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్పీకర్ పోడియం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. వారిని మార్షల్స్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. సభ నుంచి బయటకు వచ్చారు. ర్యాలీగా గన్‌పార్క్ వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. అంతకుముందు సభలో భట్టి విక్రమార్కపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా మార్షల్‌తో అదుపు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు చట్టానికి అతీతులా అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు. జరిగిన దోపిడీ గురించి మాట్లాడకుండా వేరే విషయాలు సభలో మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఘోష్ నివేదికను పొలిటికల్ సర్కస్ అనడం సరైందేనా? భట్టి అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ నేతల మాదిరి తాము లేనిది ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేయడం లేదని, వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చేందుకే ఘోష్ కమిటీ వేశామని తెలిపారు.  తమ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ చర్యలైనా చట్ట ప్రకారమే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా ఎంతకాలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని సీరియస్ అయ్యారు. తెలంగాణ సమాజానికి వాస్తవం చెప్పాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం: కేటీఆర్

‘అసెంబ్లీలో మా పార్టీ గొంతు నొక్కారు, కానీ స్పీకర్ ఏ మాత్రం సంబంధం లేనట్టు వ్యవహరించారు. మా సభ్యులు హరీశ్‌రావు ఒకరు మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ఎదురుదాడి చేశారు. ఎన్ని రకాల కుట్రలు చేసినా ప్రజల తరఫున పోరాటం చేస్తాం. కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రను ప్రజల్లో ఎండగడతాం. కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

గతంలో జరిగిన ప్రమాదం కూడా కాంగ్రెస్ నాయకత్వమే కుట్ర చేసి మేడిగడ్డ బరాజ్ నష్టానికి కారణమయిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే తీరుగా ఈరోజు కాళేశ్వరాన్ని పూర్తిగా, శాశ్వతంగా బంద్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు, రైతన్నలకు వరప్రదాయనిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు అవసరమైతే ప్రత్యేకంగా ఉద్యమం చేస్తాం. లక్షల ఎకరాల సాగునీటి సౌకర్యాన్ని, రైతన్నల భవిష్యత్తును, మొత్తంగా తెలంగాణ సాగునీటి రంగ భవిష్యత్తును కాపాడుకుంటాం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

అసెంబ్లీ నుంచి బయటికి వచ్చాక గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘20 ఏళ్ల పాటు తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు ప్రయత్నం చేశారు. దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని అరికట్టి, తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసే ప్రయత్నం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తే కేసీఆర్ పేరును చెడగొట్టచ్చన్న కుట్రతోనే కాంగ్రెస్ ఈ రిపోర్టును రూపొందించింది. అంతకుమించి ఆ రిపోర్టులో ఇంకేం లేదు. 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన చరిత్ర, బీఆర్‌ఎస్ చేసిన పనులు ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరంపై ఇచ్చింది ఘోష్ రిపో ర్టు కాదని.. అది ‘ట్రాష్’ రిపోర్ట్ మాత్రమే. అందుకే ఈ రిపోర్టు కాపీలను చెత్తబుట్టలో వేశాం.

కమిషన్స్ ఆఫ్ ఎంక్వురైస్ చట్టాన్ని ఉల్లంఘించి కమిషన్ ఈ నివేదికను రూపొందించింది. మేడిగడ్డ మరమ్మతులకు 350 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎలాంటి సంస్థ అయినా మేమే ఖర్చు పెట్టి రిపేర్ చేస్తామని చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్ల నష్టం అంటూ చెబుతుంది. రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ సైతం రూ.94,000 కోట్ల ఖర్చయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నాడు.

కాళేశ్వరం ప్రాజెక్టు లో బ్యారేజీలు, కెనాళ్లు, కాలువలు వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేశాం. కానీ మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం అన్నట్టుగా కాంగ్రెస్ అబద్ధాలు చెబుతుంది. దేశంలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఎన్డీఎస్‌ఏ విచారణ చేపట్టదు. కానీ తెలంగాణలో జరిగిన చిన్న ప్రమాదాన్ని పెద్దగా చేసి చూపించే కుట్ర చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కాళేశ్వరంపై కుట్రను ఎండగడతాం. తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి బీఆర్‌ఎస్‌పై పూర్తి విశ్వాసం ఉంది’ అని కేటీఆర్ తెలిపారు. ఘోష్ రూపొందించిన చెత్త రిపోర్టుపై న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు.