01-09-2025 10:20:55 AM
తియాంజిన్: చైనా పర్యటనలో మూడో రోజు సోమవారం తియాంజిన్‌లో జరిగే 25వ షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization) నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పాల్గొన్నారు. షీ జిన్ పింగ్ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. సదస్సుకు ప్రధాని మోదీ, పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ (SCO) సభ్యుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాద సమస్యపై ఎస్ సీవో సదస్సులో లేవనెత్తారు. ఉగ్రవాదం.. శాంతికి ముప్పుగా పరిణమించిందని మోదీ తెలిపారు. ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోందని నరేంద్ర మోదీ( Narendra Modi) వివరించారు. ఎస్ సీవో సభ్యులుగా భారత్ కీలక భూమిక పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు.
ఎస్ సీవో కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉందని తెలిపారు. భద్రత, అనుసంధానం అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయని చెప్పారు. ఎస్ సీవో వేదికగా విశ్వాస్, వికాస్ నినాదాన్ని ప్రదాని ప్రస్తావించారు. భారత్ అభివృద్ధిలో ఎస్ సీవో దేశాలు భాగస్వామ్యం కావాలని ప్రధాని ఆహ్వానించారు. ఏ దేశానికైనా భద్రత, శాంతి, స్థిరత్వం అనేవి అభివృద్ధికి పునాదులన్న ప్రధాని మోదీ ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం పెద్ద సవాళ్లుగా మారాయని చెప్పారు. ఉగ్రవాదం ఒక దేశ భద్రతకు మాత్రమే సవాలు కాదని, మానవాళి మొత్తానికీ ఉగ్రవాదం ఉమ్మడి సవాలుగా అభివర్ణించారు. ఉగ్రవాదంతో ఏ దేశం, ఏ సమాజం, ఏ పౌరుడూ సురక్షితం కాదని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ ఐక్యంగా నిలవాలని కోరారు. అల్ ఖైదా, అనుబంధ సంస్థలతో పోరులో భారత్ చొరవ చూపిందన్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారానికి వ్యతిరేకంగా భారత్ గళం వినిపించిందని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాద ఆర్థిక సహకారినికి వ్యతిరేక పోరులో మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నమ్మకం, అభివృద్ధిని భారత్ నమ్ముతోందన్నారు. సభ్య దేశాలన్నీ సంయమనంతో సమన్వయం చేసుకుంటూ ముందుకుకెళ్లాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల పహల్గాం దాడి ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందన్నారు. పవాల్గామ్ దాడి వేళ భారత్ కు మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ సీవో వేదికగా పాకిస్థాన్ వైఖరిని ప్రధాని మోదీ ఎండగట్టారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిచ్చారని ఆరోపించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్(Pakistan Prime Minister Shehbaz Sharif) సమక్షంలోనే ఆ దేశ వైఖరిని ప్రధాని తప్పుబట్టారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్ ను ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించారు. షేక్ హ్యాంగ్ ఇచ్చి పుతిన్ ను ప్రధాని ఆలింగనం చేసుకున్నారు. పుతిన్ ను కలిసిన చిత్రాలను నరేంద్ర మోదీ ఎక్స్(Narendra Modi X) లో పోస్ట్ చేశారు. పుతిన్ ను కలవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు.ఆదివారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో(Chinese President Xi Jinping) ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ.. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు, మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో కూడా సమావేశమయ్యారు.