calender_icon.png 1 September, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

01-09-2025 09:05:15 AM

ట్రాక్టర్ ను ఢీకొన్న డీసీఎం 

ఇద్దరు మృతి, పలువురికి గాయాలు 

గద్వాల జిల్లా 44వ జాతీయ రహదారిపై ఘటన 

ఇటిక్యాల:  గత ఐదు రోజుల పాటు  విఘ్నేశ్వరునికి(Ganesh Chaturthi) వారంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక చివరిరోజు ఆదివారం గణనాధుని నిమజ్జనం(Ganesh immersion) కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ట్రాక్టర్ ను పూలమాలాలు, రంగురంగుల కాగితాలతో  ప్రత్యేకంగా అలంకరించి అందులో గణనాధుని ప్రతిష్టించారు. ఇక భక్తి గీతాలతో డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఒక వేడుకగా సంతోషకరమైన వాతావరణంలో నిమజ్జనం కొరకు బయలుదేరారు.కానీ మృత్యువు డీసీఎం రూపంలో వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఆప్పటివరకు సంతోష వాతావరణంలో సాగిన నిమజ్జనపు యాత్ర క్షణాల్లో కన్నీటి పర్యంతoగ మారింది.

ఈ హృదయ విధారకర ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం 44వ జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి చోటు (తెల్లారితే సోమవారం) చోటు చేసుకుంది. ఇటిక్యాల మండల వాసులు ఆదివారం అర్ధ రాత్రి విఘ్నేశ్వరుని నిమజ్జనం కోరకు బీచుపల్లి లోని  కృష్ణా నదికి ట్రాక్టర్ పై బయలుదేరారు. కొట్టం తులసి రెడ్డి కాలేజీ సమీపంలో కర్నూల్ నుంచి హైదరాబాద్  వెళుతున్న డీసీఎం ట్రాక్టర్ ను వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జమ్మన్న అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరొక వ్యక్తి నరసింహులు మృతి చెందినట్లు సమాచారం. మిగతా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.మృతులు ఇటిక్యాల గ్రామానికి చెందినవారుగా గుర్తింపు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..